కేంద్రమంత్రి కాన్వాయ్‌పై దాడి దురదృష్టకరం: జనసేన

  • గత కొన్ని రోజులుగా బెంగాల్‌లో హింస
  • నేడు కేంద్ర మంత్రి మురళీధరన్‌ కాన్వాయ్‌పై దాడి
  • తృణమూల్‌ వర్గాల పనేనని మంత్రి ఆరోపణ
  •  ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని జనసేన పిలుపు
కేంద్రమంత్రి వి. మురళీధరన్‌ కాన్వాయ్‌పై పశ్చిమ బెంగాల్‌లో జరిగిన దాడిని జనసేన పార్టీ ఖండించింది. దీన్ని దురదృష్టకర ఘటనగా అభివర్ణిస్తూ.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రకటన విడుదల చేశారు. దాడి ఘటన చాలా బాధ కలిగించిందని.. ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని ఖండించాలని పిలుపునిచ్చారు.

 ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్‌లో వరుసగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నామని తెలిపారు. తాజాగా కేంద్రమంత్రి కాన్వాయ్‌పై జరిగిన దాడిని చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందన్నారు.

బెంగాల్‌లో ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి పలు చోట్ల హింసాత్మక ఘటనలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు కేంద్ర మంత్రి వి. మురళీధరన్‌ కాన్వాయ్‌పై కొందరు దుండగులు రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అలాగే తన వ్యక్తిగత సిబ్బందిలో కొంతమందికి గాయాలైనట్లు మంత్రి తెలిపారు. ఈ దాడి తృణమూల్‌ వర్గాలు చేసిందేనని ఆరోపించారు.


More Telugu News