'మండేలా' పాత్రలో హాస్యనటుడు సునీల్?

  • తమిళంలో వచ్చిన 'మండేలా' సినిమా 
  • టైటిల్ పాత్ర పోషించిన యోగిబాబు
  • రాజకీయ వ్యంగ్య చిత్రంగా గుర్తింపు
  • తెలుగులో రీమేక్ చేస్తున్న అనిల్ సుంకర
తమిళంలో ఎక్కువగా వచ్చేవి కమర్షియల్ చిత్రాలే అయినప్పటికీ, అప్పుడప్పుడు మంచి కథా బలం వున్న చిత్రాలు కూడా వస్తుంటాయి. వాటిలో నటించిన ఆర్టిస్టులు ఎవరైనప్పటికీ, ఆ సినిమాలకున్న కథా బలం.. దర్శక ప్రతిభ ఆయా చిత్రాలను వెలుగులోకి తెస్తుంటాయి. అలా తాజాగా వచ్చినదే 'మండేలా' సినిమా! హాస్యనటుడు  యోగిబాబు టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు మడోనా అశ్విన్ దర్శకత్వం వహించాడు.

పొలిటికల్ సెటైర్ గా రూపొందిన ఈ చిత్రంలో గ్రామ రాజకీయాలను ప్రస్తావించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామంలోని ప్రజలంతా రెండు వర్గాలుగా విడిపోవడం.. చివరికి నెల్సన్ మండేలా అనే బార్బర్ ఓటు నిర్ణయాధికారాన్ని కలిగివుండడం.. అతని ఓటు కోసం ఆయా వర్గాలు కుయుక్తులు పన్నడం.. వంటి అంశాలతో వ్యంగ్యంతో ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా ఈ చిత్రాన్ని స్టార్ విజయ్ టీవీ ద్వారా డైరెక్టుగా విడుదల చేయగా, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వెంటనే నెట్ ఫ్లిక్స్ లో కూడా ఇది స్ట్రీమింగ్ అయింది.

ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ అధినేత అనిల్ సుంకర రీమేక్ చేస్తున్న ఈ చిత్రంలో మండేలా పాత్రలో హీరోగా ప్రముఖ హాస్యనటుడు సునీల్ నటించనున్నట్టు తాజాగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.


More Telugu News