ఏపీలో కొత్త వైరస్ ఉందని దుష్ప్రచారం చేస్తున్నారు: మంత్రి పేర్ని నాని

  • మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్
  • తాము శక్తికి మించి పనిచేస్తున్నామని వెల్లడి
  • రాష్ట్రంలో ఎన్440కే వ్యాప్తి లేదని వివరణ
  • దేశంలో బి.1.617 మినహా మరే వైరస్ రకం లేదని స్పష్టీకరణ
ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మీడియా సమావేశంలో స్పందించారు. కరోనా కట్టడి కోసం జగన్ ప్రభుత్వం శక్తికి మించి అహర్నిశలు పనిచేస్తోందని అన్నారు. కానీ, చంద్రబాబు కరోనాపై ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో కొత్త వైరస్ ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్440కే వైరస్ వ్యాప్తిపై ఎలాంటి నిర్ధారణ జరగలేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. దేశంలో బి.1.617 మినహా కొత్త రకం వైరస్ ఎక్కడా లేదని అన్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

వ్యాక్సిన్ల నియంత్రణ ఎవరి చేతుల్లో ఉందో చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు రెండు విడతలు కలిపి 67,42,700 మందికి వ్యాక్సిన్ వేశామని వివరించారు. కేంద్రం సమృద్ధిగా ఇస్తే రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేయగలమని అన్నారు. రాష్ట్రంలో కరోనా చికిత్సకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఆక్సిజన్ బెడ్లు, రెమ్ డెసివిర్ ఔషధాలను అందుబాటులో ఉంచామని తెలిపారు.


More Telugu News