మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్‌సింగ్ క‌రోనాతో మృతి

  • కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డ అజిత్ సింగ్‌
  • గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుప‌త్రిలో చికిత్స
  • రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని సంతాపం
క‌రోనాతో రాష్ట్రీయ లోక్‌ దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్‌సింగ్‌(82) కన్నుమూశారు. ఆయ‌న కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడి గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుప‌త్రిలో చేరి, చికిత్స తీసుకున్నారు. ప‌రిస్థితి విష‌మించడంతో ఆయన మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు.

మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ కుమారుడే అజిత్‌సింగ్‌. ఆయ‌న‌ రాజ్యసభ, లోక్‌సభ సభ్యుడిగానూ పని చేశారు. యూపీఏ హయాంలో పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అజిత్ సింగ్ మృతి ప‌ట్ల రాష్ట్ర‌ప‌తి కోవింద్, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పాటు ప‌లువురు సంతాపం వ్య‌క్తం చేశారు.

ఆయన మ‌ర‌ణ‌వార్త త‌న‌ను క‌లచివేసిందని కోవింద్ ట్వీట్ చేశారు. రైతుల ప్ర‌యోజ‌నాల కోసం ఆయ‌న నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేశార‌ని ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు. గ‌తంలో కేంద్ర మంత్రిగా త‌న‌కు ఇచ్చిన బాధ్య‌త‌ల‌ను అజిత్ సింగ్ స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌ర్తించార‌ని పేర్కొన్నారు.


More Telugu News