ట్రంప్ ఫేస్‌బుక్ ఖాతాను స్తంభింపజేయడం సరైనదే: స్వతంత్ర బోర్డు సమర్ధన

  • నిరవధికంగా నిలిపేందుకు అనుమతివ్వాలన్న ఫేస్‌బుక్ అభ్యర్థనకు నిరాకరణ
  • ఆరు నెలల తర్వాత నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరిన బోర్డు
  • ఆ రోజు ట్రంప్ హింసకు ప్రేరేపించే పరిస్థితులు తెచ్చారన్న బోర్డు డైరెక్టర్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫేస్‌బుక్ ఖాతాను స్తంభింపజేయడం సరైన చర్యేనని ఆ సంస్థకు చెందిన స్వతంత్ర పర్యవేక్షక సంస్థ ‘ఓవర్ సైట్ బోర్డు’ డైరెక్టర్ థామస్ హ్యూజ్ పేర్కొన్నారు. అయితే, ట్రంప్ ఖాతాను నిరవధికంగా నిలిపివేసేందుకు అనుమతించాలన్న ఫేస్‌బుక్ అభ్యర్థనను థామస్ నిరాకరించారు.

సంస్థ విధానాలకు విరుద్ధంగా సస్పెన్షన్‌ను నిరవధికంగా కొనసాగించకూడదని, ఆరు నెలల తర్వాత నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు తగిన విధంగా జరిమానా విధించడంలో ఫేస్‌బుక్ విఫలమైందన్నారు. భవిష్యత్తులో ఎవరైనా ప్రభుత్వాధినేత కానీ, ఉన్నతాధికారి కానీ హానికారక సందేశాలు పెడితే కనుక ఆ ఖాతాను కొంతకాలంపాటు నిలిపివేయడమో, లేదంటే పూర్తిగా తొలగించడమో చేయాలని బోర్డు స్పష్టం చేసింది.

 కేపిటల్ భవనంపై ట్రంప్ అనుచరులు దాడిచేసి భయోత్పాతం సృష్టించిన తర్వాత ట్రంప్  ఖాతాను ఫేస్‌బుక్ సస్పెండ్ చేసింది. దీనిపై విచారణ జరిపిన బోర్డు.. హింసకు ప్రేరేపించే పరిస్థితులను ట్రంప్ ఆ రోజు తీసుకొచ్చారని పేర్కొంది. కాబట్టి ఆయన ఖాతాను సస్పెండ్ చేయడం సరైన చర్యేనని తేల్చి చెప్పారు.


More Telugu News