గత రెండేళ్లుగా మారటోరియం పొందిన వారికి మరో రెండేళ్లు ఊరట: ఆర్బీఐ

  • కరోనా కారణంగా చితికిపోయిన అన్ని వర్గాలను ఆదుకుంటాం
  • సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు బ్యాంకింగ్ రంగం సిద్ధంగా ఉండాలి
  • వ్యాపారాలు ఎలా చేసుకోవాలో కరోనా నేర్పింది
కరోనా వైరస్ దేశంలో కల్లోలం సృష్టిస్తున్న వేళ భారతీయ రిజర్వు బ్యాంకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది. కరోనా కారణంగా చితికిపోయిన అన్ని వర్గాలను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. నేడు ముంబైలో మీడియాతో మాట్లాడిన రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్.. సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు దేశ బ్యాంకింగ్ రంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. కరోనా వేళ దానిని ఎదుర్కొంటూ వ్యాపారాలు ఎలా చేయాలో అందరూ నేర్చుకున్నారని అన్నారు.

గత రెండేళ్లుగా మారటోరియం సదుపాయాన్ని పొందిన వారికి మరో రెండేళ్లపాటు మారటోరియం సదుపాయాన్ని కల్పిస్తూ ఊరటనిచ్చే ప్రకటన చేశారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలతోపాటు అసంఘటిత రంగ సంస్థలకు మరింత సహకారం అందిస్తామని శక్తికాంతదాస్ భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చి వరకు కొవిడ్ సంబంధిత మౌలిక వసతుల కోసం రూ. 50 వేల కోట్ల కేటాయింపులు చేస్తామన్నారు.

 చిన్న తరహా ఫైనాన్స్ బ్యాంకుల కోసం ప్రస్తుత రెపో రేటుకు రూ. 10 వేల కోట్లు, రుణ గ్రహీతలకు రూ. 10 లక్షల వరకు తాజా రుణాలు అందిస్తామన్నారు. ఈ ఏడాది అక్టోబరు 31 వరకు ఈ సదుపాయం అందిస్తామన్నారు. మే 20న రెండోసారి రూ. 35 వేల కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తామని శక్తికాంతదాస్ తెలిపారు.


More Telugu News