ప్రాణ వాయువు లేక చనిపోవడం అన్నది మారణహోమం వంటిదే!: అలహాబాద్ హైకోర్టు

  • ఆక్సిజన్ అందక చనిపోతున్న కరోనా బాధితులు
  • సప్లయ్ చైన్ ను అధికారులు నిర్వహించడం లేదు
  • కొవిడ్ సెంటర్లలో పరిస్థితిని సమీక్షించండి
  • అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
కరోనా బాధితులకు ఆక్సిజన్ అందక చనిపోతున్నారన్న విషయం నిజంగా మారణహోమం వంటిదేనని, ఇందుకు పాలకులదే బాధ్యతని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆక్సిజన్ ను సరఫరా చేయలేకపోవడం నేరపూరిత చర్యేనని అభిప్రాయపడింది.

సప్లయ్ చైన్ ను నిర్వహించలేని అధికారులు, నేతలు అసమర్థులేనని పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో ఆక్సిజన్ లేకుండా కరోనా బాధితులు మరణిస్తున్నారని వచ్చిన వార్తలు, ప్రచారంపై స్పందించిన జస్టిస్ సిద్ధార్ద్ వర్మ, జస్టిస్ అజిత్ కుమార్ ల ధర్మాసనం, కరోనా పరిస్థితులపై దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించింది.

లక్నో, మీరట్ జిల్లాల్లో ప్రాణ వాయువు సరఫరా అందక పలువురు మరణించగా, అన్ని కేసుల్లోనూ విచారణకు ఆదేశిస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. క్వారంటైన్ సెంటర్లలో పరిస్థితిని వెంటనే సమీక్షించాలని, అవసరార్థులకు ఆసుపత్రుల్లో బెడ్లను, ఆక్సిజన్, వెంటిలేటర్లను అందించాలని ఆదేశించింది.

"ఆక్సిజన్ అందక రోగులు మరణిస్తున్నారని విని మేము చాలా బాధపడుతున్నాం. ఇది మా మనసును కలచి వేస్తోంది. ఇది నిజంగా మారణహోమం కన్నా తక్కువేమీ కాదు. మెడికల్ ఆక్సిజన్ ను నిర్వహించాల్సిన వారు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదు.. ఈ సమయంలో ప్రజలు ముఖ్యంగా మహమ్మారి బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.

దేశంలో గుండె మార్పిడి చికిత్సలు, మెదడు ఆపరేషన్లు విజయవంతంగా జరుగుతున్న వేళ, సాధారణ జబ్బుతో రోగులు మరణించడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. సాధారణ పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ విషయంలో కోర్టులు కల్పించుకోబోవని, కానీ వార్తలు చూస్తూ, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోలు చూస్తూ, దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ఎలా తోసి పుచ్చగలమని న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లక్నో, మీరట్ కలెక్టర్లు వెంటనే స్పందించి, తమ నివేదికలను 48 గంటల్లోగా కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.


More Telugu News