ముందుచూపు లేకపోవడం, నాయకత్వలేమి.. దేశంలో కరోనా వ్యాప్తికి ఈ రెండే కారణం: రఘురామ రాజన్

  • ప్రపంచంలో ఏ జరుగుతుందో గమనించి ఉన్నా సరిపోయేది
  • వైరస్‌ను జయించేశామని ప్రకటించేశారు
  • వ్యాక్సినేషన్ నెమ్మదిగా జరుగుతుండడం కూడా ఓ కారణం
దేశంలో కరోనా వైరస్ రెండో దశలో చెలరేగిపోతుండడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉదాసీనతే కారణమని భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆరోపించారు. ‘బ్లూమ్‌బర్గ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితికి ‘ముందుచూపు లేకపోవడం’, ‘నాయకత్వలేమి’ కారణమన్నారు. కరోనా మహమ్మారి విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే దేశం నేడు ఈ పరిస్థితుల్లో చిక్కుకుని ఉండేది కాదని అన్నారు.

వైరస్‌పై మనం విజయం సాధించేశామని ప్రకటనలు గుప్పించేశారని, కానీ ప్రపంచంలో ఏం జరుగుతోందో గుర్తించి ఉంటే వైరస్ మళ్లీ విజృంభిస్తుందన్న విషయాన్ని గుర్తించగలిగి ఉండేవారని రాజన్ అన్నారు. మరోవైపు, వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతుండడం కూడా వైరస్ వ్యాప్తికి గల కారణాల్లో ఒకటన్నారు. కాగా, రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా గతంలో పనిచేసిన రఘురామ రాజన్ ప్రస్తుతం షికాగో యూనివర్సిటీలో ఫైనాన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.


More Telugu News