సాకర్ దిగ్గజం మారడోనా మృతిపై నివేదిక.. సరైన సమయంలో వైద్యం అందకే మరణించాడని తేల్చిన అధికారులు

  • గతేడాది గుండెపోటుతో మృతి చెందిన మారడోనా
  • 12 గంటలపాటు నరకయాతన అనుభవించాడన్న నివేదిక
  • 20 మంది వైద్యులు రెండు నెలలపాటు విచారణ
అర్జెంటినా సాకర్ దిగ్గజం డిగో మారడోనా మృతిపై రెండు నెలలపాటు దర్యాప్తు చేసిన అధికారులు ఎట్టకేలకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. మారడోనాకు సరైన సమయంలో వైద్య సాయం అందకపోవడం వల్లే మరణించాడని నివేదికలో పేర్కొన్నారు. 20 మంది వైద్య నిపుణులు రెండు నెలలపాటు దర్యాప్తు జరిపి ఈ నివేదికను రూపొందించారు. 60 ఏళ్ల మారడోనా గతేడాది తానుంటున్న అద్దె ఇంటిలో గుండెపోటుతో కన్నుమూశాడు. అంతకుముందు అతడి మెదడుకు శస్త్రచికిత్స జరిగింది.

రోగి (మారడోనా) ప్రాణాలకు ముప్పు ఉన్నట్టు సూచనలు కనిపించినా ఎవరూ పట్టించుకోలేదని నివేదిక పేర్కొంది. ఆ సమయంలో ఆయనకు చికిత్స లభించలేదని, దాదాపు 12 గంటలపాటు మారడోనా నరకయాతన అనుభవించాడని నివేదికలో పేర్కొన్నారు. అతడు ఉంటున్న ఇంట్లో అత్యవసర చికిత్సకు అవసరమైన కనీస ఏర్పాట్లు కూడా లేవని, సకాలంలో అతడిని ఆసుపత్రికి తరలించి ఉంటే బతికి ఉండేవాడని దర్యాప్తు జరిపిన వైద్య బృందం ఆ నివేదికలో పేర్కొంది.

మారడోనా మృతికి సంబంధించి ఆయన వద్ద పనిచేసిన బ్రెయిన్ సర్జన్ లియోపోల్డో లుకె, సైకియాట్రిస్ట్ కొసచోవ్ సహా ఏడుగురు విచారణ ఎదుర్కొన్నారు. తాజా నివేదిక నేపథ్యంలో వారిపై చర్యలు ఉండే అవకాశం ఉంది.


More Telugu News