ప్రధాని కొత్త నివాసం గురించి కాదు.. ప్రజల ప్రాణాల కోసం అన్ని వనరులను వాడండి: ప్రియాంకాగాంధీ

  • బెడ్లు, ఆక్సిజన్ దొరక్క ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు
  • ప్రజల ప్రాణాలు కాపాడటంపై కేంద్రం దృష్టి సారించాలి
  • 13 వేల కోట్లతో ప్రధాని నివాసాన్ని నిర్మిస్తున్నారు
కరోనా బారిన పడిన ఎంతో మంది అమాయక ప్రజలు ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానికి కొత్త ఇంటిని కట్టించే అంశంపై కాకుండా... ప్రజల ప్రాణాలను కాపాడే అంశంపై కేంద్రం పూర్తి స్థాయిలో దృష్టిని సారించాలని హితవు పలికారు. ప్రజల ప్రాణాల కోసం అన్ని వనరులను వినియోగించాలని డిమాండ్ చేశారు.

సెంట్రల్ విస్టా (కొత్త పార్లమెంటు నిర్మాణం) ప్రాజెక్టులో భాగంతో ప్రధాని నివాసాన్ని కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ని ఇబ్బందులు ఉన్నా అనుకున్న సమాయానికి ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు.

13 వేల కోట్లతో ప్రధాని కోసం కొత్త నివాసాన్ని నిర్మిస్తున్నారని... ఈ నిర్మాణం వల్ల కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు మరోలా ఉన్నాయనే సందేశం ప్రజల్లోకి వెళ్తుందని ప్రియాంక అన్నారు. మరోవైపు 2022 డిసెంబర్ నాటికి ప్రధాని నివాసం నిర్మాణాన్ని పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు.


More Telugu News