మెక్సికోలో వంతెన పైనుంచి పడిపోయిన రైలు... 20 మంది మృతి

  • మెక్సికోలో విషాదం
  • ఓవర్ పాస్ కూలిపోయిన వైనం
  • కిందకు పడిపోయిన రైలు బోగీలు
  • క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు
మెక్సికోలో ఘోరప్రమాదం జరిగింది. రాజధాని మెక్సికో సిటీలో వంతెనపై ప్రయాణిస్తున్న మెట్రో రైలు కిందికి పడిపోయిన ఘటనలో 20 మంది వరకు మరణించారు. 49 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కింద ఉన్న రోడ్డుపై ట్రాఫిక్ రద్దీగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పైన ఓవర్ పాస్ పై వెళుతున్న మెట్రో రైలు ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోవడంతో పైనుంచి పడిపోయింది.

ఈ ఘటనలో పలు బోగీలు ధ్వంసం అయ్యాయి. శిధిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మెక్సికో సిటీ మేయర్ క్లాడియో షైన్బమ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా, ఓవర్ పాస్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెక్సికో ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం మెక్సికో విదేశీ వ్యవహారాల మంత్రి మార్సెలో ఎబ్రాడ్ గతంలో నగర మేయర్ గా ఉన్న సమయంలో ఈ ఓవర్ పాస్ నిర్మించారు.


More Telugu News