ఐదు వారాల తరువాత ముంబైలో భారీగా పడిపోయిన కొత్త కేసులు!

  • సోమవారం 2,624 కేసులు
  • ఐదు వారాల తరువాత కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం
  • దేశంలో అత్యధిక కేసులున్న తొలి నగరంగా పుణె
ముంబై మహానగరం కరోనా వైరస్ నుంచి నెమ్మదిగా కోలుకుంటోంది. దాదాపు ఐదు వారాల తరువాత రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సోమవారం నాడు 2,624 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇదే సమయంలో రోజువారీ టెస్టుల సంఖ్య కూడా 50 వేల నుంచి 38 వేలకు తగ్గిందని అధికార గణాంకాలు వెల్లడించాయి. ఇక, నగరంలో నిన్న 68 మంది కన్నుమూయగా, మొత్తం మరణాల సంఖ్య 13,372కు పెరిగింది.

ఈ సంవత్సరం మార్చి 17న ముంబైలో 2,377 కొత్త కేసులు వచ్చాయి. ఆపై కేసుల సంఖ్య క్రమంగా పెరిగింది. రెండో దశ ప్రమాదకరంగా విస్తరించింది. ఓ దశలో రోజువారీ కేసుల సంఖ్య 10 వేలకు పెరిగాయి. మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్, దేశమంతా ప్రభావం చూపింది. దేశంలోనే అత్యధికంగా నష్టపోయిన నగరంగా ముంబై నిలిచింది.

గత నెలలో మహారాష్ట్రలో ఒకరోజు కేసుల సంఖ్య 60 వేలను దాటిందంటే పరిస్థితి ఎంత తీవ్రతరమైందో అర్థం చేసుకోవచ్చు. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 48,621 కొత్త కేసులు రాగా, 59,500 మందికి పైగా డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవలి కాలంలో కొత్త కేసుల కన్నా డిశ్చార్జ్ లు అధికంగా నమోదు కావడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన లాక్ డౌన్ నిబంధనల కారణంగానే కేసుల సంఖ్య అదుపులోకి వచ్చిందని ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇదిలావుండగా, ముంబై తరువాత ఇప్పుడు పుణె ఆ స్థానాన్ని ఆక్రమించింది. పుణెలో ఒకరోజు కేసులు నిన్న 7,718కు పెరిగాయి. ఆ తరువాతి స్థానంలో 5,350 కేసులు నాగపూర్ లో నమోదయ్యాయి.


More Telugu News