'బారిసిటినిబ్' ఔషధానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్... లాభాల బాటలో 'నాట్కో' ఫార్మా షేర్లు

  • కరోనా చికిత్సలో రెమ్ డెసివిర్ కు డిమాండ్
  • ప్రత్యామ్నాయంగా బారిసిటినిబ్ పై కేంద్రం దృష్టి
  • అత్యవసర అనుమతులు మంజూరు
  • ఈ వారం నుంచే ఉత్పత్తి చేస్తామన్న నాట్కో ఫార్మా
  • 3.35 శాతం వృద్ధితో ట్రేడవుతున్న నాట్కో షేర్లు
దేశంలో కరోనా చికిత్స అంటే రెమ్ డెసివిర్ తప్పనిసరి అన్నట్టుగా పరిస్థితి తయారైంది. దాంతో రెమ్ డెసివిర్ ఔషధానికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోవడంతో లభ్యత బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సలో రెమ్ డెసివిర్ తో పాటు ఇకపై బారిసిటినిబ్ (1 ఎంజీ, 2 ఎంజీ, 4 ఎంజీ) మాత్రలను కూడా ఉపయోగించేందుకు అత్యవసర అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు సీడీఎస్ సీఏ (కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ) పచ్చ జెండా ఊపింది.  

నాట్కో ఫార్మా సంస్థ బారిసిటినిబ్ ఉత్పత్తిదారు కాగా, కేంద్రం నిర్ణయం నేపథ్యంలో నాట్కో ఫార్మా షేర్లు లాభాల బాటలో పరుగులు తీస్తున్నాయి. 3.35 శాతం పెరుగుదలతో రూ.926.70 వద్ద ట్రేడవుతున్నాయి. బారిసిటినిబ్ కు కేంద్రం ఓకే చెప్పడంపై నాట్కో ఫార్మా స్పందించింది. దేశవ్యాప్తంగా కరోనా చికిత్స కోసం బారిసిటినిబ్ ను సరఫరా చేస్తామని, అందుకోసం ఈ వారం నుంచే ఉత్పత్తి చేస్తామని వెల్లడించింది. కాగా, ఈ మాత్రల ధరలను నాట్కో ఇంకా వెల్లడించలేదు.


More Telugu News