రీకౌంటింగ్ పై కోర్టుకు వెళతా: నందిగ్రామ్ ఫలితంపై మమతా అసంతృప్తి

  • నందిగ్రామ్‌ ఫలితాల సమయంలో అనూహ్య పరిణామాలు
  • తొలుత మమత గెలిచారని వార్తలు
  • కొద్ది సేపట్లోనే సువేందు విజయం సాధించారని ప్రకటన
  • గవర్నర్‌ తనకు శుభాకాంక్షలు కూడా తెలిపారన్న దీదీ
  • రీకౌంటింగ్‌పై కోర్టుకు వెళతానని వ్యాఖ్య
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేసిన నందిగ్రామ్‌ ఎన్నికల ఫలితాల ప్రకటనలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తొలుత మమత గెలిచారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, అనూహ్యంగా కొద్దిసేపట్లోనే దీదీపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి స్వల్ప మెజారిటీతో గెలుపొందారని ప్రకటించారు. అయితే, దీనిపై తృణమూల్‌ రీకౌంటింగ్‌ కోరగా.. ఎన్నికల సంఘం తిరస్కరించినట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కోర్టుకు వెళ్లాలని మమత నిర్ణయించుకున్నారు.

కాగా, నిన్న నందిగ్రామ్ ఓట్ల లెక్కింపు సందర్భంగా అసలేం జరిగిందో మమత వివరించారు. ఓట్ల లెక్కింపు సమయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. దాదాపు 4 గంటల పాటు సర్వర్‌ డౌన్ అయ్యిందన్నారు. తాను గెలిచినట్టుగా గవర్నర్‌ కూడా  శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించారు. కానీ, కొద్దిసేపట్లోనే అంతా మారిపోయిందన్నారు. రీకౌంటింగ్ కు అంగీకరిస్తే ప్రాణాలకే ముప్పు ఉంటుందని ఓ రిటర్నింగ్ అధికారిని బెదిరించిన విషయం కూడా తనకు తెలిసిందని అన్నారు. దీనిపై కోర్టుకు వెళతానని దీదీ చెప్పారు.


More Telugu News