జగన్‌కు అధికారంలో ఉండే అర్హత లేదు: పరిటాల సునీత

  • హిందూపురం ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక రోగులు మృతి చెందడం బాధాకరం
  • ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి ఎంత మంది బలి కావాలి?
  • బాలకృష్ణ ఇచ్చిన వెంటిలేటర్లను కూడా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయలేదు
అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ అందక రోగులు మృతి చెందడంపై టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్సిజన్ అందక రోగులు మృతి చెందడం బాధాకరమని ఆమె అన్నారు. ఆక్సిజన్ అందించలేని స్థితిలో ఉన్న సీఎం జగన్ కు అధికారంలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. రెండు రోజుల వ్యవధిలో హిందూపురం ఆసుపత్రిలో 12 మంది చనిపోయారని... మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ తాడేపల్లిలో కూర్చుని చోద్యం చూస్తున్నారని... ఇది సిగ్గుచేటని అన్నారు. వైసీపీ ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి ఎంత మంది బలికావాలని ప్రశ్నించారు. అనంతపురం, కర్నూలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక 26 మందికి పైగా చనిపోయారని అన్నారు.

కరోనా సోకిందనే ఆందోళన కంటే ఆక్సిజన్ దొరుకుతుందా? లేదా? అనే ఆందోళనే ప్రజలకు ఎక్కువగా ఉందని సునీత అన్నారు. ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడం... మోసపూరిత మాటలతో రాజకీయ పబ్బం గడుపుకోవడంపైనే జగన్ దృష్టి సారిస్తున్నారని చెప్పారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనే హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెంటిలేటర్లను అందజేశారని... వాటిని ఇప్పటి వరకు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయలేదని దుయ్యబట్టారు. జగన్ ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలని... తాడేపల్లి ప్యాలస్ ను దాటి ఆసుపత్రులను సందర్శించాలని చెప్పారు. ఆక్సిజన్, ఆసుపత్రుల్లో బెడ్లు, రెమిడిసివిర్ ఇంజెక్షన్ల కొరతపై దృష్టిని సారించాలని డిమాండ్ చేశారు.


More Telugu News