వ్యోమగాములను సురక్షితంగా భూమికి చేర్చిన స్పేస్ ఎక్స్ క్యాప్సూల్

  • వారం రోజుల క్రితం నలుగురు వ్యోమగాములను ఐఎస్ఎస్‌కు చేర్చిన నౌక
  • 167 రోజులుగా ఐఎస్ఎస్‌లో ఉన్న వారిని భూమికి చేర్చిన వైనం
  • ఆరున్నర గంటలపాటు ప్రయాణించి పనామా తీరంలో ల్యాండింగ్
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 167 రోజులుగా ఉండి పరిశోధనలు చేస్తున్న నలుగురు వ్యోమగాములను స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ సురక్షితంగా భూమికి తీసుకొచ్చింది. వీరిలో ముగ్గురు అమెరికాకు చెందిన వారు కాగా, ఒకరు జపాన్ వ్యోమగామి. వ్యోమగాములతో ఆరున్నర గంటలపాటు ప్రయాణించిన అంతరిక్ష నౌక నిన్న తెల్లవారుజామున మెక్సికో గల్ఫ్‌లోని పనామా నగర తీరానికి సమీపంలో పడింది.

అందులోని నాలుగు పారాచూట్లు సకాలంలో విచ్చుకుని చక్కగా పనిచేసినట్టు స్పేస్ ఎక్స్ తెలిపింది. ఓ క్యాప్సూల్ రాత్రి సమయంలో సురక్షితంగా ల్యాండ్ కావడం 1968 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, ఇదే నౌక వారం రోజుల క్రితం నలుగురు వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి చేర్చింది. తిరుగు ప్రయాణంలో వీరిని మోసుకొచ్చింది. ఈ ఏడాది సెప్టెంబరులో డ్రాగన్ క్యాప్సూల్ మరోమారు అంతరిక్షంలోకి వెళ్లనుంది.


More Telugu News