కొవిడ్‌ విధుల్లోకి ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం విద్యార్థులు!

  • కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం
  • మెడికల్, నర్సింగ్‌ కోర్సులు చేసిన వారికీ పిలుపు
  • ఈరోజు జరిపిన సమీక్షలో మోదీ చర్చ
  • కొవిడ్‌ విధుల్లో చేరిన విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకాలు
  • ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం
  • రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రులకు తాకిడి పెరగడంతో వైద్య సిబ్బంది కొరతను గుర్తించిన ప్రభుత్వం.. ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం విద్యార్థులను సైతం వైద్య సేవల్లో వినియోగించుకోవాలని యోచిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కొవిడ్‌ పరిస్థితులపై ఈరోజు జరిగిన సమీక్షలో మోదీ మానవ వనరుల కొరతపై ప్రత్యేకంగా మాట్లాడినట్లు పేర్కొన్నాయి.

విద్యార్థులు సహా మెడికల్‌, నర్సింగ్‌ కోర్సులు పూర్తి చేసిన వారినీ కొవిడ్‌ విధుల్లో చేరాలని పిలుపునివ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అలాగే వారికి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై రేపు ఓ ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.  దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో వైద్య సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని వార్తలు వస్తున్న తరుణంలో ఈ సమీక్ష జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.


More Telugu News