మమతా బెనర్జీ తాజా వ్యాఖ్యలతో నందిగ్రామ్ ఫలితంపై అయోమయం!

  • నందిగ్రామ్ లో మమత వర్సెస్ సువేందు
  • మమత గెలిచినట్టు తొలుత వార్తలు
  • ఫలితం గురించి బాధపడవద్దంటూ మమత తాజా వ్యాఖ్యలు
  • ప్రజల తీర్పును అంగీకరిస్తున్నానని వెల్లడి
  • నందిగ్రామ్ ఫలితం వెల్లడించవద్దని ఈసీని కోరిన టీఎంసీ!
పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితంపై గందరగోళం నెలకొంది. నందిగ్రామ్ బరిలో సీఎం మమతా బెనర్జీ, బీజేపీ తరఫున సువేందు అధికారి పోటీ పడ్డారు. అయితే, సువేందుపై మమతా 1200 ఓట్ల మెజారిటీతో నెగ్గినట్టు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే, మమతా బెనర్జీ తాజా వ్యాఖ్యలతో నందిగ్రామ్ ఫలితంపై అనిశ్చితి ఏర్పడింది.

"నందిగ్రామ్ ఫలితం గురించి బాధపడకండి. ఇదేమంత పెద్ద విషయం కాదు. నందిగ్రామ్ కోసం ఎంతో పోరాటం చేశాను. నందిగ్రామ్ ప్రజలు వాళ్లు ఇవ్వాలనుకున్న తీర్పును ఇచ్చేశారు. దాన్ని నేను అంగీకరిస్తున్నాను. దాని గురించి నేనేమీ పట్టించుకోవడంలేదు. 221 కంటే ఎక్కువ సీట్లను గెలుస్తున్నాం. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది" అని వ్యాఖ్యానించారు. అటు, నందిగ్రామ్ ఫలితం ప్రకటించవద్దని తృణమూల్ వర్గాలు ఎన్నికల సంఘాన్ని కోరినట్టు తెలుస్తోంది. తృణమూల్ విజ్ఞప్తిని ఎన్నికల సంఘం పరిశీలిస్తున్నట్టు సమాచారం.


More Telugu News