18 ఏళ్లు పైబడిన 80 వేల మందికి శనివారం టీకా: కేంద్రం!

  • నిన్న మొదలైన మూడవ దశ వ్యాక్సినేషన్
  • 84,599 మందికి టీకాలు అందించాం
  • గణాంకాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ
మే 1 నుంచి ఇండియాలో 18 నుంచి 44 సంవత్సరాల వయసు మధ్య ఉన్న వారికి టీకాలు ఇవ్వాలని నిర్ణయించిన కేంద్రం, నిన్న దాదాపు 80 వేల మందికి పైగా టీకాలను అందించింది. శనివారం నాడు మొత్తం 84,599 మంది 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ తొలి డోస్ ను అందించామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రారంభమై శనివారం నాటికి 106 రోజులు కాగా, నిన్న 16,48,192 వ్యాక్సిన్ డోస్ లను ఇచ్చామని తెలిపింది. అందులో 9.89 లక్షల డోస్ లను తొలి డోస్ గా ఇచ్చామని, 6.58 లక్షల డోస్ లను సెకండ్ డోస్ గా ఇచ్చామని పేర్కొంది.

ఇంతవరకూ ఇండియాలో 15.66 కోట్ల మందికి వ్యాక్సిన్ అందిందని, ఇందులో 94.28 లక్షల మంది హెల్త్ కేర్ వర్కర్లు తొలి డోస్ తీసుకోగా, 62.65 లక్షల మందికి రెండో డోస్ అందిందని, ఫ్రంట్ లైన్ వర్కర్లలో 1.26 కోట్ల మందికి తొలి డోస్ ను, అందులో 68.78 లక్షల మందికి సెకండ్ డోస్ ను ఇచ్చామని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఫ్రంట్ లైన్ వర్కర్లు, డాక్టర్లు, ఆర్మీ కేటగిరీలను మినహాయిస్తే, 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వారికి 5.33 కోట్ల మందికి తొలి డోస్ ఇప్పటికే అందిందని, వారిలో 40 లక్షల మందికి రెండో డోస్ కూడా ఇచ్చామని వెల్లడించింది.

60 ఏళ్లు పైబడిన వారిలో 5.26 కోట్ల మందికి తొలి డోస్ ను ఇవ్వగా, వారిలో 1.14 కోట్ల మందికి రెండో డోస్ కూడా అందిందని కేంద్రం ప్రకటించింది. సాధ్యమైనంత త్వరగా దేశవాసులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు నిర్ణయించామని ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా, వ్యాక్సిన్ పంపిణీపై హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే.



More Telugu News