బిగ్ డే... కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి!

  • మరికాసేపట్లో ప్రారంభం కానున్న కౌంటింగ్
  • తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
  • ఆపై తెరచుకోనున్న ఈవీఎంలు
  • గెలుపుపై ఎవరి ధీమా వారిదే
  • కరోనా నిబంధనల మేరకు కౌంటింగ్
నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ నేడు జరుగనుంది. అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఏపీలో తిరుపతి పార్లమెంట్, తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ, మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ కూడా జరుగనుంది.  కరోనా నిబంధనలను పాటిస్తూ, ఈ ప్రక్రియను నిర్వహిస్తామని, సాధ్యమైనంత తక్కువ మందిని మాత్రమే కౌంటింగ్ హాల్ లోకి అనుమతిస్తామని ఈసీ ఇప్పటికే పేర్కొంది. కరోనా టీకా రెండు డోస్ లను వేయించుకున్న వారిని మాత్రమే కౌంటింగ్ విధుల్లో నియమించాలని తొలుత వెల్లడించిన ఈసీ, ప్రస్తుతం మాత్రం రెండుడోస్ లు వేయించుకున్న వారు చాలినంత మంది లభ్యం కాకపోవడంతో, ఒక డోస్ వేయించుకున్న వారిని కూడా కౌంటింగ్ లో నియమించారు.  

కాగా, జాతీయ స్థాయిలో ఎంతో ఉత్కంఠను, రాజకీయ నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలకు దారితీసిన ఈ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ లో అత్యంత సుదీర్ఘంగా ఎనిమిది విడతల్లో జరిగిన సంగతి తెలిసిందే. తమిళనాడు, కేరళలో మాత్రం ఒక్క దశలోనే పోలింగ్ ముగిసిపోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలే మరోసారి గెలుస్తాయని, అయితే, కొంత మేరకు మెజారిటీ తగ్గవచ్చని అంచనా వేశాయి. తమిళనాడులో అధికార మార్పిడి ఖాయమని తేల్చి చెప్పాయి. మిగతా రాష్ట్రాల అంచనాల మాట ఎలా ఉన్నా, పశ్చిమ బెంగాల్ పై ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తాము అంగీకరించడం లేదని, ప్రజల నాడిని సంస్థలు పట్టుకోలేదని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు.

ఇక, ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుండగా, తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఆపై ఈవీఎంలు తెరచుకోనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు వ్యాఖ్యానించారు. అభ్యర్థుల తరఫున కౌంటింగ్ కేంద్రాల్లోకి ఏజంట్లుగా వచ్చేవారు తమకు కరోనా సోకలేదన్న సర్టిఫికెట్ ను తీసుకుని రావడం తప్పనిసరని, ఆర్టీ పీసీఆర్ టెస్ట్ నెగటివ్ రిపోర్టును సమర్పిస్తేనే వారిని లోనికి అనుమతిస్తామని స్పష్టం చేశారు.


More Telugu News