సిక్సర్ల వర్షం కురిపించిన రాయుడు... చెన్నై భారీ స్కోరు

  • ఐపీఎల్ లో ముంబయి వర్సెస్ చెన్నై
  • మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై
  • రాయుడు మెరుపు ఇన్నింగ్స్
  • 27 బంతుల్లోనే 72 నాటౌట్
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 218 పరుగులు చేసిన చెన్నై
తెలుగుతేజం అంబటి రాయుడు ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో పరుగుల మోత మోగించాడు. ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో రాయుడు మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 218 పరుగులు చేసింది. తక్కువ స్కోరుకు పరిమితం అవుతుందనుకున్న చెన్నై జట్టుకు ఊపిరి పోసింది రాయుడి ఇన్నింగ్సే. రాయుడు కేవలం 27 బంతుల్లో 72 పరుగులు సాధించాడు. రాయుడు స్కోరులో 2 ఫోర్లు, 7 భారీ సిక్సులున్నాయి. బుమ్రా, బౌల్ట్, ధవళ్ కులకర్ణి, రాహుల్ చహర్ వంటి బౌలర్లను ఏమాత్రం ఖాతరు చేయకుండా రాయుడు విధ్వంసం సృష్టించాడు.

ఓవైపు రాయుడు తమ బౌలింగ్ ను తుత్తునియలు చేస్తుంటే ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఓ దశలో 116 పరుగులకే చెన్నై 4 వికెట్లు కోల్పోవడంతో చెన్నై సారథి ధోనీ ముఖంలో నిస్తేజం కనిపించింది. కానీ రాయుడు ఎప్పుడైతే సునామీలా విరుచుకుపడ్డాడో ధోనీ ముఖంలో నవ్వులు విరబూశాయి.

చెన్నై ఇన్నింగ్స్ లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (4) ఆరంభంలోనే వెనుదిరగ్గా, మరో ఓపెనర్ డుప్లెసిస్ (50), మొయిన్ అలీ (36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 58 రన్స్) భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఓ దశలో వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన చెన్నై కనీసం 160 పరుగులైనా చేస్తుందా అనిపించింది.

కానీ, రాయుడు రంగప్రవేశంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వచ్చీరావడంతోనే బ్యాట్ ఝుళిపించిన రాయుడు 20 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ తెలుగుదేజం ధాటికి ముంబయి బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.


More Telugu News