టీకాల కోసం నాపై తీవ్ర ఒత్తిడి ఉంది.. అందుకే లండన్‌ వచ్చాను: అదర్‌ పూనావాలా

  • పెద్ద పెద్ద వ్యక్తులు కాల్‌ చేస్తున్నారు
  • టీకాల కోసం ఆవేశంగా మాట్లాడుతున్నారు
  • ఒత్తిడిని అధిగమించడానికే భార్యాపిల్లల దగ్గరకు వచ్చాను
  • భారత్‌ వెలుపలా టీకా ఉత్పత్తి చేసే యోచన
  • ప్రపంచంలో అత్యంత చౌకైన టీకా కొవిషీల్డ్‌
  • టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీరం సీఈఓ
భారత్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో టీకాల కోసం తనపై ఒత్తిడి పెరిగిందని కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పూనావాలా తెలిపారు. దేశంలో పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి టీకా కోసం డిమాండ్‌ చేస్తూ కాల్స్ వచ్చాయని తెలిపారు. ఆ ఒత్తిడిని అధిగమించడానికే లండన్‌లోని తన భార్యా పిల్లల దగ్గరకు వచ్చానని తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ది టైమ్స్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు. వై కేటగిరీ భద్రత కల్పించిన తర్వాత ఆయన మాట్లాడడం ఇదే తొలిసారి.

మరోసారి అలాంటి ఒత్తిడిలోకి వెళ్లదలచుకోలేదని.. అందుకే లండన్‌లో మరింత కాలం ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. టీకాలను అందించే బాధ్యత మొత్తం తనపైనే పడిందని.. కానీ, తాను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని తెలిపారు. భారత్‌లో టీకాల కోసం కొంతమంది అంచనాలు, ఆవేశాలు ఊహించని స్థాయిలో ఉన్నాయని తెలిపారు. ప్రతిఒక్కరూ తమకే వ్యాక్సిన్‌ కావాలని కోరుకుంటున్నారని.. ఇతరులకు దాని అవసరం ఎంతో గుర్తించడం లేదని అభిప్రాయపడ్డారు.

యూకేకి వెళ్లడంలో వ్యాపారపరమైన కారణాలు కూడా ఉన్నాయని తెలిపారు. వ్యాక్సిన్‌ తయారీని భారత్‌ వెలుపల కూడా చేపట్టేందుకు యోచిస్తున్నామని వెల్లడించారు. దీనిపై రానున్న కొన్ని రోజుల్లో ప్రకటన ఉంటుందని తెలిపారు. పరిస్థితులు ఈ స్థాయికి దిగజారుతాయని చివరకు దేవుడు కూడా అంచనా వేసి ఉండరన్నారు. ఇక కొవిషీల్డ్‌ టీకా ధరలపై మాట్లాడుతూ.. ప్రపంచంలో కొవిషీల్డ్‌ కంటే చౌకైన వ్యాక్సిన్‌ మరొకటి లేదని అభిప్రాయపడ్డారు.


More Telugu News