కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని తమ బాధ్యతలను నిర్వర్తించాలి: సోనియా గాంధీ

  • జాతీయ వ్యూహం రూపొందించాలి
  • వలస కూలీలకు రూ.6 వేలు ఇవ్వాలి
  • దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందజేయాలి
  • ఔషధాల మార్కెటింగ్‌ను అరికట్టాలి
  • కేంద్రానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలి సూచనలు
దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే మేల్కొని తమ బాధ్యతలు నెరవేర్చాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ హితవు పలికారు. కరోనా కట్టడి కోసం అన్ని పార్టీలను సంప్రదించి జాతీయ స్థాయిలో ఓ సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలని కేంద్రానికి సూచించారు. ఈ మేరకు శనివారం ఆమె వీడియో సందేశం విడుదల చేశారు.

కీలక వైద్య సరఫరాల కొరత కరోనా సంక్షోభాన్ని మరింత తీవ్రం చేసిందని సోనియా తెలిపారు. ఈ పరీక్షా సమయంలో ఒకరికొకరు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అనేక రాష్ట్రాలు ఆక్సిజన్‌, బెడ్లు, ఔషధాల కొరతతో సతమతమవుతున్నాయన్నారు. సంక్షోభం ముగిసేవరకు వలస కూలీలకు కనీసం రూ.6 వేలు వారి ఖాతాలో జమ చేయాలని డిమాండ్‌ చేశారు.

దేశ ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రాన్ని సోనియా కోరారు. దేశ వ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచాలన్నారు. రెమ్‌డెసివిర్‌ వంటి కీలక ఔషధాల బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టాలని కోరారు. వెంటనే పరిశ్రమల్లో వినియోగించే ఆక్సిజన్‌ను మెడికల్‌ ఆక్సిజన్‌గా మార్చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కరోనా కట్టడిలో కాంగ్రెస్ తరఫున సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.


More Telugu News