పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించే పరిస్థితి వస్తుందని నేను భావించడం లేదు: ఉద్ధవ్ థాకరే

  • కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 10 లక్షలకు చేరేవి
  • కఠిన నిబంధనలతో రోజు వారీ కేసులు తగ్గాయి
  • నిన్న 3 లక్షల వ్యాక్సిన్ డోసులు వచ్చాయి
అక్కడక్కడ లాక్ డౌన్లతో పాటు, కఠిన నిబంధనలను అమలు చేయకపోతే ఈపాటికి మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 9 నుంచి 10 లక్షలకు చేరేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ డోసులను బట్టి ఈరోజు నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలను వేస్తామని చెప్పారు. పూర్తి లాక్ డౌన్ విధించాల్సి అవసరం లేదని... ఆ పరిస్థితి వస్తుందని కూడా తాను భావించడం లేదని అన్నారు. ఈ రోజు మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజాగా చేపట్టిన కఠిన నిబంధనలతో రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుదలను కట్టడి చేశామని ఉద్ధవ్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6.5 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పారు. గత ఏడాది మాదిరే... ఇప్పుడు కూడా అందరం కలసికట్టుగా మహమ్మారిని కట్టడి చేద్దామని పిలుపునిచ్చారు. 18 నుంచి 44 ఏళ్ల వయసున్న వారికి కావాల్సిన 12 కోట్ల వ్యాక్సిన్ డోసుల కోసం వన్ టైమ్ పేమెంట్ చెక్ ఇస్తామని తెలిపారు. నిన్న రాష్ట్రానికి మూడు లక్షల డోసుల వ్యాక్సిన్ వచ్చిందని చెప్పారు.


More Telugu News