అందరికీ అందుబాటులో బ్రిటన్ ప్రధాని ఫోన్ నంబరు.. జాతీయ భద్రతకు ముప్పు ఉందని ఆందోళన!

  • 15 ఏళ్లుగా ఒకే నంబరు వాడుతున్న బోరిస్ జాన్సన్
  • 2006లో విద్యాశాఖ సహాయమంత్రిగా ఉన్న సమయంలో జర్నలిస్టులకు ఫోన్ నంబరు
  • ప్రధాని సంభాషణలను శత్రువులు వినే అవకాశం ఉందంటూ ఆందోళన
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఫోన్ నంబరు పబ్లిక్‌గా అందరికీ అందుబాటులో ఉన్నట్టు వస్తున్న వార్తలపై స్పందించేందుకు  ఆయన కార్యాలయం నిరాకరించింది. ప్రధాని నంబరు అందరికీ అందుబాటులో ఉండడంతో ఆయన భద్రతకు ముప్పువాటిల్లే అవకాశం ఉందని, బ్లాక్‌మెయిలింగ్, లాబీయింగ్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రతిపక్ష లేబర్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది.

జాన్సన్ 2006లో హెన్లీ పార్లమెంటు సభ్యుడిగా, విద్యాశాఖ సహాయ మంత్రిగా జాన్సన్ పనిచేశారు. ఆ సమయంలో జర్నలిస్టులకు తన ఫోన్ నంబరు ఇచ్చారు. అప్పటి నుంచి, అంటే గత 15 ఏళ్లుగా ఆయన ఒకే నంబరు వాడుతున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రధాని తన ఫోన్ నంబరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని పౌరసేవల విభాగం అధిపతి సూచించారని ‘ద డైలీ టెలిగ్రాఫ్’ పత్రిక పేర్కొంది.

ప్రధాని ఫోన్ నంబరు అందరికీ అందుబాటులో ఉండడం ప్రమాదకరమని మాజీ జాతీయ భద్రతా సలహాదారు పీటర్ రికెట్స్ పేర్కొన్నారు. ప్రధాని తన నంబరుతో జరిపే సంభాషణలను శత్రువులు రహస్యంగా వినే అవకాశం ఉందని, సంఘ విద్రోహశక్తులు దానిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.


More Telugu News