వచ్చే వారమే దేశంలో రోజువారీ కేసులు తారస్థాయికి!

  • వెల్లడించిన శాస్త్రవేత్తల బృందం
  • గతంలో అంచనా వేసిన దానికంటే ముందే ఉద్ధృతి
  • మే 3-5 మధ్య అత్యధిక కేసులు
  • ఎలా ఎదుర్కోవాలన్న దానిపైనే దృష్టి పెట్టాలని సూచన
  • వాస్తవ కేసులు 50 రెట్లు అధికంగా ఉంటాయని అంచనా
కరోనా కేసులు మే 3-5 మధ్య తారస్థాయికి చేరుకుంటాయని కేంద్ర ప్రభుత్వానికి సలహాలు అందిస్తున్న శాస్త్రవేత్తల బృందమొకటి తెలిపింది. వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉందని.. గతంలో అంచనా వేసిన దానికంటే ముందే కేసులు తారస్థాయికి చేరే అవకాశం ఉందని వెల్లడించింది.

‘‘వచ్చే వారంలో దేశవ్యాప్తంగా రోజువారీ కేసులు తారస్థాయికి చేరుకుంటాయని విశ్వసిస్తున్నాం’’ అని శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహిస్తున్న ఎం.విద్యాసాగర్‌ తెలిపారు. అయితే, ఏప్రిల్‌ 2న ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో మే 5-10 మధ్య కేసులు భారీ స్థాయిలో వెలుగులోకి వస్తాయని ఈ బృందం తెలిపింది. తాజాగా దాన్ని మరింత ముందుకు జరపడం గమనార్హం.  

రానున్న నాలుగు నుంచి ఆరు వారాల్లో కరోనాపై ఎలా పోరాడాలన్నదే థ్యేయంగా ముందుకు సాగాలని విద్యాసాగర్‌ తెలిపారు. దీర్ఘకాలిక పరిష్కారాలపై ఆలోచిస్తూ సమయం వృథా చేయొద్దని.. తక్షణ కర్తవ్యంపైనే దృష్టి సారించాలని పేర్కొన్నారు. కరోనా తొలి దశలో అత్యధిక కేసులు సెప్టెంబరు మధ్యలో వచ్చాయని విద్యాసాగర్‌ గుర్తుచేశారు.

ఇప్పుడు దాని కంటే మూడింతల అధిక కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18.8 మిలియన్లకు, మరణాలు 2,08,000కు చేరాయని తెలిపారు. అయితే, చాలా మందిలో లక్షణాలు బయటకు రావడం లేదు గనుక వాస్తవ కేసుల సంఖ్య 50 రెట్లు అధికంగా ఉంటాయని అంచనా వేశారు.


More Telugu News