ఎగ్జిట్ పోల్స్ పై పొంగిపోతున్న డీఎంకే అధినేత స్టాలిన్... కార్యకర్తలకు కీలక సూచనలు

  • ఏప్రిల్ 6న తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు
  • మే 2న ఓట్ల లెక్కింపు
  • ఎగ్జిట్ పోల్స్ లో డీఎంకే వైపే మొగ్గు
  • కరోనా నేపథ్యంలో కార్యకర్తలకు స్టాలిన్ హితవు
  • కౌంటింగ్ కేంద్రాల వద్ద గుమికూడవద్దని స్పష్టీకరణ
గురువారం నాడు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అనేక పార్టీలను సంతోషంలో ముంచెత్తాయి. అలాంటి పార్టీల్లో డీఎంకే ఒకటి. ఏప్రిల్ 6న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో డీఎంకే కూటమిదే విజయం అని పేర్కొన్నారు. అనేక సర్వేల్లో 160 సీట్లకు అటూఇటూగా డీఎంకే వైపే మొగ్గు కనిపించింది. ఈ పరిణామంతో డీఎంకే శ్రేణుల్లో సందడి మొదలైంది.

డీఎంకే అధినేత స్టాలిన్ సైతం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సంతోషంతో పొంగిపోతున్నారు. అయితే, మే 2న ఓట్ల లెక్కింపు సందర్భంగా డీఎంకే కార్యకర్తలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడవద్దని హితవు పలికారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా కార్యకర్తలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. ఫలితాల అనంతరం విజయోత్సవ సంబరాలను తమ నివాసాల్లోనే జరుపుకోవాలని సూచించారు. ఆనందాన్ని గుండెల్లో నింపుకుందాం... వీధులను ఖాళీగా ఉంచుదాం అని స్టాలిన్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తల ప్రాణాలు తమకెంతో ముఖ్యమని అన్నారు.


More Telugu News