ఏమైందో ఏమో... కేంద్రంపై ఈటల ఒక్కరోజులోనే మాట మార్చారు: బీజేపీ నేత వివేక్

  • ఆక్సిజన్ సరఫరాపై కేంద్రంపై ఈటల వ్యాఖ్యలు
  • ఈటల వ్యాఖ్యలను తప్పుబట్టిన వివేక్
  • ప్రభుత్వ పెద్దలే ఈటలతో చెప్పించారని ఆగ్రహం
  • కరోనా నేపథ్యంలో రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యలు
బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పై ధ్వజమెత్తారు. ఇటీవల వరకు కేంద్రంపై సానుకూల ధోరణిలో మాట్లాడిన ఈటల ఒక్కరోజులోనే మాట మార్చారని ఆరోపించారు. తెలంగాణకు అవసరమైన దానికంటే ఎక్కువే ఆక్సిజన్ ఇస్తున్నారంటూ నిన్నటివరకు కేంద్రాన్ని పొగిడిన ఈటల... ఇప్పుడు ఏమైందో ఏమో గానీ ఒక్కసారిగా భిన్నస్వరం వినిపిస్తున్నారని వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తగినంత ఆక్సిజన్ ఇవ్వడంలేదని ఈటల చెబుతున్నారని, ఈటలతో ప్రభుత్వ పెద్దలే బలవంతంగా ఈ మాటలు చెప్పించారని అన్నారు. కేంద్రంపై ఈటల వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నట్టు వివేక్ తెలిపారు.

కరోనా నియంత్రణ చేతకాని రాష్ట్ర ప్రభుత్వం, పరిస్థితులను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణకు 5 ఆక్సిజన్ ప్లాంట్లను కేంద్రం కేటాయిస్తే, ఒక్కటి కూడా కేటాయించలేదని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సర్కారు తాజా పరిణామాలకు కేంద్రమే కారణమని ఆరోపణలు చేస్తూ తప్పించుకోవాలని చూస్తోందని వివేక్ ఆక్షేపించారు. ఆక్సిజన్, రెమ్ డెసివిర్ బ్లాక్ మార్కెట్ ను కట్టడి చేయడంలో తెలంగాణ సర్కారు విఫలమైందని అన్నారు.


More Telugu News