వారందరికీ ఉచిత విద్య అందించండి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సోనూ సూద్​ విజ్ఞప్తి

  • స్కూల్ నుంచి కాలేజీ వరకు విద్యకు ఖర్చును భరించాలని సూచన
  • వారు ఏది చదవాలనుకుంటే దానిని చదివించాలని విజ్ఞప్తి
  • తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల భవిష్యత్ అగమ్యగోచరమంటూ ఆవేదన
కరోనా కష్ట కాలంలో ఎంతో మంది నిరుపేదలకు సాయం చేస్తూ రియల్ లైఫ్ హీరోగా నిలిచిన సోనూ సూద్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరో విజ్ఞప్తి చేశారు. కరోనా బారిన పడి కుటుంబ పెద్దలను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్యను అందించాలని కోరారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఓ వీడియో సందేశాన్నిచ్చారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎంతో మంది బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చనిపోయిన వారిలో చాలా మందికి చిన్న పిల్లలున్నారని అన్నారు. ఐదేళ్లు, 8 ఏళ్లు, 12 ఏళ్ల వయసున్న ఎంతో మంది చిన్నారుల తల్లిదండ్రులనూ కరోనా కబళించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ చిన్నారుల భవిష్యత్ ఏంటో తలచుకుంటుంటూనే చాలా భయంగా, బాధగా ఉందన్నారు. ఆ చిన్నారులకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు.. ఆ చిన్నారులకు ఉచిత విద్యనందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ విద్యా సంస్థలైనా, ప్రైవేట్ విద్యా సంస్థలైనా వారికి ఉచితంగా చదువు చెప్పించాలన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి, కాలేజీ వరకు అన్నింటినీ భరించాలన్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్.. ఇలా ఆ చిన్నారులు ఏం చదువుకుంటే ఆ చదువుకు ఖర్చులను భరించాలని ఆయన కోరారు.


More Telugu News