త‌న త‌ప్పేమీ లేదంటూ వీడియో రూపంలో మాట్లాడిన యాంక‌ర్ శ్యామ‌ల భ‌ర్త‌!

  • ఓ మ‌హిళ నుంచి రూ.85 లక్షలు నగదు తీసుకుని మోసం చేసిన కేసు
  • బెయిల్‌పై విడుద‌లైన నరసింహారెడ్డి
  • తనపై తప్పుడు కేసు పెట్టారని వ్యాఖ్య‌
  • నిజానిజాలను చెప్ప‌డానికి  మరికొన్ని రోజుల్లో మ‌ళ్లీ  వస్తాన‌న్న న‌టుడు
ఓ మ‌హిళ నుంచి రూ.85 లక్షలు నగదు తీసుకుని మోసం చేసిన కేసులో యాంక‌ర్ శ్యామ‌ల భ‌ర్త‌, న‌టుడు లక్ష్మీనరసింహారెడ్డితోపాటు ఆయనకు సాయం చేసిన జయంతి గౌడ్‌ అనే మహిళను పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. బెయిల్‌పై విడుద‌లైన  నరసింహారెడ్డి త‌న త‌ప్పు ఏమీ లేదంటూ ఓ వీడియో రూపంలో మాట్లాడాడు.

ఈ వీడియోను శ్యామ‌ల త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. తనపై తప్పుడు కేసు పెట్టారని అందులో న‌ర‌సింహారెడ్డి చెప్పుకొచ్చాడు. అయిన‌ప్ప‌టికీ త‌న‌కు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపాడు. భ‌గ‌వంతుడి దయ వల్ల నేను తిరిగి ఇంటికి వచ్చేశానని అన్నాడు.

సోషల్ మీడియాలో త‌న గురించి వస్తోన్న కథనాలకు సంబంధించిన అన్ని నిజానిజాలను చెప్ప‌డానికి
మరికొన్ని రోజుల్లో మ‌ళ్లీ  వస్తానని, కేసు ఏమిటి? అందులోని నిజానిజాలేమిటో చెబుతాన‌ని అన్నాడు. అన్నిరకాల ఆధారాలను తాను చూపుతాన‌ని చెప్పాడు. త‌న‌కు న్యాయం, న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు.

త‌న‌పై పెట్టింది తప్పుడు కేసు అనడానికి ఆధారాలతో తాను రెండు రోజుల్లోనే ప్ర‌జ‌ల‌ ముందుకు వ‌స్తాన‌న్నాడు. కొన్నిసార్లు మ‌న‌పై ఇలాంటి నిందలు పడుతుంటాయ‌ని చెప్పాడు. అయిన‌ప్ప‌టికీ వ‌దంతుల‌పై తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు.



More Telugu News