ఇండియాలో నంబర్ వన్ స్టార్టప్ గా ఎదిగిన బైజూస్!

  • పేటీఎంను కిందకు నెట్టేసిన బైజూస్
  • 16.5 బిలియన్ డాలర్ల విలువ
  • ఎడ్ టెక్ కంపెనీలను విలీనం చేసుకోనున్న బైజూస్
ఇండియాలో అత్యధిక విలువున్న స్టార్టప్ కంపెనీల ర్యాంకుల్లో మార్పులు జరిగాయి. ఎడ్ టెక్ రంగంలో రాణిస్తున్న బైజూస్, ఇప్పుడు మోస్ట్ వాల్యూడ్ సంస్థగా ఎదిగింది. లాక్ డౌన్ సమయంలో విద్యార్థులంతా ఇంటికి పరిమితం కావడం, అలీబాబా, పేటీయం, సాఫ్ట్ బ్యాంక్ వంటి ప్రముఖ కంపెనీలు అండగా ఉండటంతో బైజూస్ విలువ ఏకంగా 16 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. బైజూస్ సంస్థ యూబీఎస్ గ్రూప్ నుంచి మరో 200 మిలియన్ డాలర్ల వరకూ నిధులను సమీకరించాలని నిర్ణయించుకోవడంతో, సంస్థ విలువ మరో అర బిలియన్ డాలర్లు పెరిగి 16.5 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.

గత సంవత్సరంలో బైజూస్ 1 బిలియన్ డాలర్ల మూలనిధిని సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరిన్ని నిధుల వేటలో నిమగ్నమైంది. ఈ నిధులతో సంస్థను మరింతగా విస్తరించాలన్నది బైజూస్ యాజమాన్యం అభిమతం. అయితే, ఈ విషయంలో సంస్థ నుంచి ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. సమీకరించిన నిధులతో ఇప్పటికే సేవలందిస్తున్నచిన్న చిన్న ఎడ్ టెక్ కంపెనీలను విలీనం చేసుకోవాలని కూడా సంస్థ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక ఇండియాలోని స్టార్టప్ కంపెనీల ర్యాంకులను పరిశీలిస్తే, బైజూస్ 16.5 బి. డాలర్లతో తొలి స్థానంలోఉండగా, పేటీఎం 16 బి. డాలర్లు, ఓయో 9 బి. డాలర్లతో, జొమాటో 5.4 బి. డాలర్లతో, స్విగ్గీ 5 బి. డాలర్ల విలువతో ఉన్నాయి. బైజూస్ ఇప్పుడు చర్చిస్తున్న నిధుల సేకరణ డీల్ కుదిరితే, టాప్ స్టార్టప్ గా సంస్థ స్థానం మరింత పదిలమవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదిలావుండగా, కోచింగ్ నెట్ వర్క్ సేవలందిస్తున్న ఆకాష్ ఇనిస్టిట్యూట్ ను విలీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న బైజూస్, ఇప్పటికే సీసీఐ (కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) అనుమతులు కోరింది. మహమ్మారి ప్రభావం చూపుతున్న రోజుల్లో నేరుగా లాభాలను ఆర్జించిన సంస్థల్లో ఎడ్ టెక్ కంపెనీలు తొలుత నిలిచాయన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కరోనా రెండో దశ సాగుతుండగా, ఈ సంస్థలు మరిన్ని లాభాలను ఆర్జించే అవకాశాలు ఉన్నాయి.


More Telugu News