రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ సీసాలో నీళ్లు నింపి మోసం.. డాక్టర్, కాంపౌండర్ అరెస్ట్

  • నిజామాబాద్‌లో ఒకే రోజు మూడు ఘటనలు
  • రెమ్‌డెసివిర్ సీసాల్లో నీళ్లు నింపి విక్రయిస్తున్న వైద్యుడు
  • ఆసుపత్రి నుంచి అక్రమంగా ఇంజక్షన్లు తీసుకొచ్చిన నర్సు
  • అక్రమంగా విక్రయిస్తూ పట్టుబడిన మరో వ్యక్తి
రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌లో నీళ్లు నింపి మోసానికి పాల్పడిన వైద్యుడు, కాంపౌండర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్‌లో జరిగిందీ ఘటన. ఇక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడికి రెమ్‌డెసివిర్ అవసరమని వైద్యులు చెప్పారు. దీంతో రోగి బంధువులు ఓ మధ్యవర్తి ద్వారా రూ. 85 వేలు వెచ్చించి ఓ మధ్యవర్తి ద్వారా ఐదు వయల్స్ కొని తీసుకొచ్చి వైద్యులకు ఇచ్చారు. వాటిని చూసిన వైద్యులు అనుమానంతో పరీక్షించగా, ఇంజక్షన్ సీసాల్లో నీళ్లు నింపినట్టు గుర్తించారు. దీంతో బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీకాకుళానికి చెందిన ఆన్‌కాల్ వైద్యుడు సాయి కృష్ణమనాయుడే ఈ పనికి పాల్పడినట్టు గుర్తించారు. ఖాళీ రెమ్‌డెసివిర్ సీసాల్లో నీళ్లు నింపి కాంపౌండర్ సతీశ్‌గౌడ్ ద్వారా రోగులకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. విచారణలో సాయి కృష్ణమనాయుడు నేరాన్ని అంగీకరించాడు. దీంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

నిజామాబాద్‌లోనే జరిగిన మరో ఘటనలో ఔట్ సోర్సింగ్ నర్సు ఎలిజబెత్ అలియాస్ స్రవంతి రెమ్‌డెసివిర్ ఇంజక్షను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తూ పట్టుబడింది. ఆసుపత్రి నుంచి రెండు ఇంజక్షన్లను అక్రమంగా తీసుకొచ్చిన స్రవంతి వాటిని తన భర్తకు అందజేసింది. అతడు ఓ రోగికి రూ. 89 వేలకు విక్రయిస్తుండగా పోలీసులు  దాడిచేసి పట్టుకున్నారు. స్రవంతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకో ఘటనలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న కిరణ్ బయటి వ్యక్తి సాయిలుతో కలిసి ఒక్కో ఇంజక్షన్ వయల్‌ను రూ. 32 వేలకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పై మూడు ఘటనల్లోనూ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News