ఢిల్లీలో మూడు నెలల్లో 18-44 ఏళ్ల వారందరికీ టీకా అందిస్తాం: కేజ్రీవాల్‌

  • ప్రణాళికలు సిద్ధం చేశామన్న ఢిల్లీ సీఎం
  • భారీగా వ్యాక్సిన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడి
  • మూడు లక్షల డోసులకు ఇప్పటికే ఆర్డర్‌
  • మరో 50 లక్షల డోసులకు ఆర్డర్‌ 
  • టీకాల కొరత ఉందన్న ఆరోగ్యశాఖ మంత్రి
దేశ రాజధాని ఢిల్లీలో రానున్న మూడు నెలల్లో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా అందించే కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధమయ్యాయని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. భారీ ఎత్తున నగరవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. అర్హులందరూ స్వచ్ఛందంగా తరలి వచ్చి టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఈ విషయంపై ఇప్పటికే అధికారులతో కూలంకషంగా చర్చించినట్లు తెలిపారు.

ఢిల్లీలో ఇప్పటికే మూడు లక్షల డోసుల కోసం ఆర్డర్‌ పెట్టినట్లు అధికారులు తెలిపారు. మరో 50 లక్షల డోసుల కోసం ఆర్డర్‌ చేస్తున్నామని వెల్లడించారు. టీకాల సేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని తెలిపారు. త్వరలోనే తొలి విడత వ్యాక్సిన్లు తయారీ సంస్థల నుంచి అందనున్నాయని పేర్కొన్నారు.

అంతకుముందు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్ మాట్లాడుతూ.. దేశ రాజధానిలో 18-44 ఏళ్ల వారికి టీకా అందించేందుకు వ్యాక్సిన్‌ కొరత ఉందని తెలిపారు. టీకాల కొనుగోలు కోసం ఆర్డర్లు పెట్టామని వెల్లడించారు. అయితే, వయోజనులందరికీ టీకా అందించే కార్యక్రమానికి మాత్రం ఏర్పాట్లన్నీ పూర్తి చేశామన్నారు.


More Telugu News