35 లక్షల మంది విద్యార్థుల కోసం నా దీక్ష కొనసాగుతుంది: కేఏ పాల్

  • పది, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని దీక్షకు దిగిన పాల్
  • ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకునేంత వరకు దీక్ష కొనసాగుతుందని స్పష్టీకరణ
  • రెండు నెలలు పరీక్షలు వాయిదా వేయాలని మాత్రమే కోరుతున్నా
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్ విశాఖలో దీక్షను చేపట్టారు. ఏపీలో 10వ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణను వ్యతిరేకిస్తూ తన కన్వెషన్ భవనంలో దీక్షకు కూర్చున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునేంత వరకు తన దీక్ష కొనసాగుతోందని చెప్పారు. కరోనా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో విద్యార్థులకు పరీక్షలను నిర్వహించడం సరికాదని అన్నారు.

తన పిల్లలను కూడా పరీక్షలకు పంపడం లేదని కేఏ పాల్ తెలిపారు. పరీక్షలను రద్దు చేయమని కానీ, పాస్ చేయమని కానీ తాను కోరడం లేదని... కేవలం రెండు నెలల పాటు పరీక్షలను వాయిదా వేయాలని మాత్రమే కోరుతున్నానని చెప్పారు. ఇదే అంశంపై హైకోర్టులో పిటిషన్ వేశానని.. రేపు విచారణ జరుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు. 35 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు తన దీక్ష కొనసాగుతుందని... కరోనా నేపథ్యంలో తన దీక్ష వద్దకు ఎవరూ రావద్దని కోరారు.


More Telugu News