కరోనాతో చికిత్స తీసుకుంటూ ఆసుపత్రి నుంచే ఉత్తమ్​ వీడియో సందేశం

  • కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్
  • రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం వల్లే నిస్సహాయ స్థితిలో ప్రజలు
  • రెండు మూడు రోజుల్లో తాను డిశ్చార్జ్ అవుతానని వెల్లడి
  • ప్రజల ప్రార్థనలతో తన ఆరోగ్యం బాగుందని కామెంట్
  • గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న టీపీసీసీ చీఫ్
కరోనాతో బాధపడుతున్న నిరుపేదలకు చికిత్స అందించి ఆదుకోవడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కరోనా బారిన పడిన ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గురువారం ఆసుపత్రి నుంచే వీడియో సందేశం ఇచ్చారు. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు.

ఆసుపత్రిలో కనీస వసతులు కల్పించాలని కోరారు. బెడ్లు, ఆక్సిజన్, రెమ్డెసివిర్ వంటి మందుల కొరత లేకుండా చూసుకుంటూ పేషెంట్లకు అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత అన్నారు. కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. ప్రజల ప్రార్థనలతో తాను సురక్షితంగా ఉన్నానని ఉత్తమ్ చెప్పారు. తన ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రెండు మూడు రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతానని ఆయన చెప్పారు.

కాగా, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చాలా మంది కరోనా పేషెంట్లు నానా ఇబ్బందులు పడుతూ నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా బాధితుల సహాయార్థం గాంధీభవన్ తో పాటు రాష్ట్ర వ్యాపంగా కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసిందన్నారు. కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసిన కార్యకర్తలను అభినందించారు. ఏఐసీసీ ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ ఆదేశాల మేరకు వాటిని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. సెకండ్ వేవ్ ను అధిగమించేందుకు ప్రజలకు తోచినంత సాయం చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.




More Telugu News