బెంగాల్ లో కొనసాగుతున్న చివరి విడత పోలింగ్.. బాంబు విసిరిన దుండగులు!

  • చివరి విడతలో 35 నియోజకవర్గాలకు పోలింగ్
  • ఎన్నికల బరిలో 283 మంది అభ్యర్థులు
  • భద్రతా విధుల్లో 641 కంపెనీల కేంద్ర బలగాలు
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. ఈరోజు చివరి విడత పోలింగ్ (8వ ఫేజ్) జరుగుతోంది. చివరి విడతలో 35 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా... 283 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 84 లక్షల మందికి పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తీవ్రమైన కరోనా పరిస్థితుల మధ్యే పోలింగ్ కొనసాగుతోంది.

పోలింగ్ సందర్భంగా పలు చోట్ల చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. ఉత్తర కోల్ కతాలోని మహాజతి సదన్ ఆడిటోరియం వద్ద దుండగులు బాంబు విసిరారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం... వెంటనే పూర్తి నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించింది.

మరోవైపు హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 641 కంపెనీల కేంద్ర బలగాలు విధుల్లో ఉన్నాయి. బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్, ఆయన భార్య సుదేశ్ ధన్కర్ లు కోల్ కతాలోని చౌరంగీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.


More Telugu News