1000 ఆక్సిజన్ సిలిండర్లు, కోటిన్నర ఎన్ 95 మాస్క్ లు, 10 లక్షల రాపిడ్ కిట్లను పంపించిన అమెరికా!

  • రెండో వేవ్ తో ఇబ్బందులు పడుతున్న ఇండియా
  • నేడు అందనున్న అమెరికా సాయం 
  • 2 కోట్ల టీకా డోస్ లను పంపుతామన్న లాయిడ్ జే ఆస్టిన్
కరోనా మహమ్మారి రెండో వేవ్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇండియాకు సాయమందించేందుకు పలు ప్రపంచ దేశాలు ముందుకు రాగా, అమెరికా భారీ సాయం అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 1000 ఆక్సిజన్ సిలిండర్లు, 1.5 కోట్ల ఎన్ 95 మాస్క్ లు, 10 లక్షల రాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్ కిట్ లను పంపించింది. నేడు తొలి విడత షిప్ మెంట్ ఇండియాకు చేరనుండగా, మిగతావి వచ్చే వారంలోగా ఇండియాకు రానున్నాయి. ఈ విషయాన్ని శ్వేతసౌధం ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇదే సమయంలో తాము ఆర్డర్ చేసిన ఆస్ట్రాజెనికా టీకాలను ఇండియాకు పంపాలని కూడా ఇప్పటికే ఆదేశించామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ జే ఆస్టిన్ తెలిపారు. మొత్తం 2 కోట్ల టీకా డోస్ లను ఇండియాకు పంపనున్నామని పేర్కొన్నారు. "కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తొలి రోజుల్లో ఇండియా మాకు సాయం చేసింది. ఇదే విధంగా ఇప్పుడు మేము ఇండియాకు సాయపడాలని నిర్ణయించాం" అని వైట్ హౌస్ పేర్కొంది.

ఇండియాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండగా, వ్యాధి సోకి మరణించిన వారి సంఖ్య బుధవారం 2 లక్షలను దాటిందన్న సంగతి తెలిసిందే. ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతుండగా, మెడికల్ ఆక్సిజన్, అవసరమైన వారికి పడకలు కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. నిన్న మొత్తం 3.60 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా, ప్రపంచంలోనే ఇదే అత్యధిక రోజువారీ కొత్త కేసుల సంఖ్యకావడం గమనార్హం.



More Telugu News