హైదరాబాద్ జట్టుకు మరో భంగపాటు.. చెన్నై చేతిలో దారుణ ఓటమి

  • హైదరాబాద్‌ను వేధిస్తున్న పరాజయాలు
  • పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లిన చెన్నై
  • కింది నుంచి తొలి స్థానంలో సన్‌రైజర్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోమారు ఘోర పరాజయాన్ని అందుకుంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి వార్నర్ సేన తడబడుతూనే ఉంది. అంతంతమాత్రం ఆటతీరుతో  పరాజయాలను కొనితెచ్చుకుంటోంది. పటిష్టమైన టాపార్డర్ ఉన్నప్పటికీ ఆ జట్టును అపజయాలు వేధిస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ 5 పరాజయాలు, ఒక విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

గత రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమి పాలై పరాజయాల సంఖ్యను పెంచుకుంది. బౌలర్లకు ఏమాత్రం సహకరించని పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. వార్నర్ (55), మనీష్ పాండే (61)లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.

అనంతరం 172 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై..రుతురాజ్ గైక్వాడ్ (44 బంతుల్లో 12 ఫోర్లతో 75 ), డుప్లెసిస్ (38 బంతుల్లో 6 పోర్లు, సిక్సర్‌తో 56 ) హైదరాబాద్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. ఫలితంగా మరో 9 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఈ గెలుపుతో ధోనీ సేన 10 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 75 పరుగులు చేసిన గైక్వాడ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్‌లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ జట్లు  ఢిల్లీలో పోరాడనున్నాయి.


More Telugu News