తృణమూల్‌ అభ్యర్థి కరోనాతో మృతి.. ఎన్నికల అధికారులపై ఫిర్యాదు చేసిన ఆయన భార్య!

  • ఎన్నికల సంఘం నిర్లక్ష్యం వల్లేనని ఆరోపణ
  • 8 విడతల పోలింగ్‌ను తప్పుబట్టిన అభ్యర్థి భార్య
  • ఇతర రాష్ట్రాల్లో త్వరగా ముగిశాయని వ్యాఖ్య
  • విడతల్ని కుదించాలని తృణమూల్‌ విజ్ఞప్తి
  • ఎన్నికల సంఘం పట్టించుకోలేదని ఆరోపణ
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో ఖర్దా నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థి కాజల్‌ సిన్హా ఏప్రిల్‌ 25 న కొవిడ్‌తో మరణించారు. అయితే, తాజాగా ఆయన భార్య నందితా సిన్హా డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ సుదీప్‌ జైన్‌ సహా ఇతర ఎన్నికల సంఘం అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో  వీరి అలసత్వం వల్లే తన భర్త చనిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. బెంగాల్‌లో ఎనిమిది విడతల సుదీర్ఘ పోలింగ్‌ నిర్వహించడాన్ని నందితా సిన్హా ఫిర్యాదులో తప్పుబట్టారు. బెంగాల్‌తో పాటు ఎన్నికలు జరిగిన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో.. అసోంలో మూడు విడతల్లో పోలింగ్‌ జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో పోలింగ్‌ విడతల్ని కుదించాలని తృణమూల్‌ కోరినప్పటికీ.. ఎన్నికల సంఘం పెడచెవిన పెట్టిందని తెలిపారు. కంటితుడుపు చర్యలతో సరిపెట్టిందని ఆరోపించారు.

కోల్‌కతా హైకోర్టు మహమ్మారి విజృంభణపై అప్రమత్తం చేసినప్పటికీ.. ఎన్నికల సంఘం బేఖాతరు చేసిందని నందితా సిన్హా ఫిర్యాదులో ఆరోపించారు. కొవిడ్‌ నిబంధనల్ని కఠినంగా అమలు చేసే అధికారం ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం ఆ దిశగా పటిష్ఠ చర్యలు తీసుకోలేదన్నారు.


More Telugu News