కర్ణాటకలో కరవు పనుల కోసం పేర్లు నమోదు చేయించుకుంటున్న పీహెచ్ డీ పట్టాదారులు

  • కరోనా సంక్షోభంతో పెరిగిన నిరుద్యోగిత
  • సొంతూళ్లకు చేరుకుంటున్న వలసజీవులు
  • ఆశాదీపంలా ఎంజీఎన్ఆర్ఈజీఎస్
  • కడుపు నింపుకునేందుకు కరవు పనుల్లో విద్యాధికులు
కరోనా సంక్షోభం దేశంలో నిరుద్యోగితను మరింత పెంచింది. కరోనా కారణంగా నష్టాలపాలైన అనేక సంస్థలు ఉద్యోగులను తొలగించడం, కొత్త నియామకాలు వంటివి చేపట్టకపోవడం వంటి చర్యలతో కోలుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దాంతో అనేకమంది పట్టభద్రులు, పీజీ విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.

కరోనాతో కుదేలవుతున్న కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో, పీహెచ్ డీ చేసినవాళ్లు కూడా ఉపాధి కోసం చిన్నాచితకా పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్)లో భాగంగా కరవు పనుల కోసం వారు తమ పేర్లను నమోదు చేయించుకుంటున్నారు. ఇటీవల రాష్ట్రంలో నమోదైన కరవు పనుల కార్మికుల జాబితాలో పీహెచ్ డీ పట్టాదారుల పేర్లు ఉండడం పరిస్థితికి అద్దంపడుతోంది.

హనగల్ తాలూకాలో ఓ జాబితాను పరిశీలించగా... 8 మంది పట్టభద్రులు, 12 మంది పీజీ , నలుగురు పీహెచ్ డీ పట్టా అందుకున్న వారు ఉన్నారు. కరోనా తొలి తాకిడితో బాగా నష్టం జరగ్గా, ఇప్పుడు సెకండ్ వేవ్ మరింతగా ప్రభావం చూపుతోంది. వలస వెళ్లిన వాళ్లందరూ సొంతూళ్లకు చేరుకుంటున్నారు. వారిలో అత్యధికులకు ఈ ఊపాధి హామీ పథకమే కడుపు నింపుతోంది.

హవేరీ జిల్లాలో గతేడాది లాక్ డౌన్ అనంతరం 3,649 మంది తమ పేర్లు నమోదు చేయించుకోగా, ఈ ఏడాది అది 4,842కి పెరిగింది. వారిలో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, బీఎస్సీ, బీఈడీ విద్యార్థులు, పీహెచ్ డీ పట్టా అందుకున్నవారు కూడా ఉన్నారు.


More Telugu News