వచ్చే ఏడాది నాటికి కరోనా పీచమణిచే ఓరల్​ ఔషధం: ఫైజర్​

  • మరో ఇంజెక్షన్ పైనా పరిశోధనలు చేస్తున్నామన్న సంస్థ
  • ఇదే వేగంతో పరిశోధనలు జరిగితే మందు సిద్ధమని కామెంట్
  • స్పైక్ ప్రొటీన్ ను టార్గెట్ చేసుకునే యాంటీ వైరల్ ను తయారు చేస్తున్నామని వెల్లడి
వచ్చే ఏడాదిలో కరోనాకు నోటి ద్వారా తీసుకునే ఔషధాన్ని అందుబాటులోకి తెస్తామని ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ బౌర్లా ప్రకటించారు. ప్రస్తుతం రెండు యాంటీ వైరల్ ఔషధాలపై తాము పరిశోధనలు చేస్తున్నామని, అందులో ఒకటి ఓరల్ (నోటి ద్వారా తీసుకునే) ఔషధం కాగా ఇంకొకటి ఇంజెక్షన్ అని ఆయన చెప్పారు. అయితే, ప్రస్తుత ప్రాధాన్యాల దృష్ట్యా తాము ఓరల్ ఔషధంపైనే ఎక్కువగా పనిచేస్తున్నామన్నారు.

నోటి ద్వారా తీసుకునే మందులకు ఆసుపత్రి దాకా పోవాల్సిన అవసరం లేదని, ఇంజెక్షన్లు అయితే కచ్చితంగా ఆసుపత్రికి వెళ్లే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే, ఇదే వేగంతో పరిశోధనలు జరిగితే, ఔషధ నియంత్రణ సంస్థలు తమ మందుకు ఆమోదం తెలిపితే ఈ ఏడాది చివరి నాటికి మందు సిద్ధమైపోతుందని, వచ్చే ఏడాది ప్రారంభం నాటికి అందుబాటులోకి వస్తుందని బౌర్లా వెల్లడించారు.

ఎన్ని వేరియంట్లు వచ్చినా దాని పీచమణిచే మందుల తయారీనే లక్ష్యమన్నారు. ప్రస్తుతమున్న యాంటీ వైరల్ ఔషధాలు కరోనా వైరస్ లోని స్పైక్ ప్రొటీన్ పై పనిచేయడం లేదని స్పష్టం చేశారు. కాబట్టి తాము ఎస్ ప్రొటీన్ లో జరుగుతున్న జన్యు పరివర్తనలనే టార్గెట్ చేసుకునే ఔషధాన్ని తయారు చేస్తున్నామని చెప్పారు. ఈ వేసవి కాలం నాటికి మరికొన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు.


More Telugu News