ఐపీవోకి వెళ్లిన జొమాటో.. విలువెంతంటే..!

  • రూ.8,260 కోట్ల విలువైన షేర్లు ప్రజల్లోకి
  • నిధుల సమీకరణ కోసమేనన్న సంస్థ
  • రూ.750 కోట్ల షేర్లను విక్రయించనున్న ఇన్ఫో ఎడ్జ్
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో ఐపీవో (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్)కు వెళ్లింది. సుమారు రూ.8,260 కోట్ల (111 కోట్ల డాలర్లు) విలువైన ఐపీవోకు ఫైల్ చేసింది. కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న సమయంలోనూ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ బిజినెస్ కు మంచి ఊపు రావడం, అంతా అనుకూలంగా ఉండడంతో జొమాటో ఐపీవోకు వెళ్లేందుకు నిర్ణయించుకుంది. ఈరోజు భారత మార్కెట్ నియంత్రణ సంస్థకు తన ఐపీవో ముసాయిదా ఫైల్ ను సమర్పించింది.

అందులో రూ.7,500 కోట్ల విలువైన కొత్త షేర్లను ప్రజలకు ఆఫర్ చేస్తున్నట్టు జొమాటో వెల్లడించింది. నిధుల సమీకరణ, సాధారణ కార్పొరేట్ వ్యవహారాల కోసం ఐపీవోకు వెళ్తున్నట్టు సంస్థ ప్రకటించింది. మార్కెట్ లో అత్యున్నత షేర్ హోల్డర్ అయిన ఇన్ఫో ఎడ్జ్ అనే సంస్థ రూ.750 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తుందని పేర్కొంది.

కాగా, 2008లో మొదలైన ఈ స్టార్టప్ కు చైనా దిగ్గజ సంస్థ యాంట్ గ్రూప్ పెట్టుబడులు పెడుతోంది. 24 దేశాల్లో జొమాటో సేవలందిస్తోంది. 5 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐదుగురు ఇన్వెస్టర్ల నుంచి 25 కోట్ల డాలర్ల నిధులను జొమాటో సమీకరించింది.


More Telugu News