'జగనన్న వసతి దీవెన' నిధులు విడుదల చేసిన సీఎం జగన్

  • ఏపీలో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వసతి దీవెన
  • తొలి విడతగా రూ.1,048.94 కోట్లు విడుదల
  • 10.89 లక్షల మంది విద్యార్థులకు లబ్ది
  • చదువుకు పేదరికం అడ్డం కాకూడదన్న సీఎం జగన్
  • కరోనా సంక్షోభంలోనూ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడి
ఏపీలో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ ఆపై కోర్సులు చదివే విద్యార్థుల హాస్టల్ ఫీజులను జగనన్న వసతి దీవెన పేరిట వైసీపీ ప్రభుత్వం చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2020-21 ఏడాదికి తొలి విడత నిధులను సీఎం జగన్ నేడు విడుదల చేశారు. 10.89 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,048.94 కోట్ల నగదు జమ చేసినట్టు సీఎం జగన్ వెల్లడించారు.

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, చదువుకు పేదరికం అడ్డంకి కాకూడదన్నదే తమ అభిమతం అని స్పష్టం చేశారు. ప్రతి ఏడాది రెండు వాయిదాల్లో జగనన్న వసతి దీవెన నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఆపై కోర్సులు చదివే విద్యార్థులకు రూ.20 వేలు వసతి దీవెన రూపంలో అందిస్తున్నట్టు సీఎం జగన్ వివరించారు.

తల్లుల ఖాతాలో వేయడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని, తల్లులే నేరుగా ఫీజు కట్టడం వల్ల కాలేజీల యాజమాన్యాల్లో జవాబుదారీ తనం వస్తుందని స్పష్టం చేశారు. కొవిడ్ సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు.


More Telugu News