ఢిల్లీ కొంపముంచిన స్టోయినిస్ ఆఖరి ఓవర్... రిషబ్ పంత్ స్పందనిది!

  • మా స్పిన్నర్లు రాణించలేదు
  • అందుకే స్టోయినిస్ తో ఆఖరి ఓవర్
  • గెలుపు ముందు బోల్తా పడటంతో నిరాశ
  • మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్
మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ జట్టు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత ఆర్సీబీ బౌలింగ్ చేయగా, 19 ఓవర్ల వరకూ కంట్రోల్ లో ఉంచుకున్న ఢిల్లీ జట్టు,చివరి ఓవర్లో మాత్రం గతి తప్పింది. ఆఖరి ఓవర్ ను స్టోయినిస్ చేత బౌలింగ్ చేయించాలని డీసీ కెప్టెన్ రిషబ్ పంత్ నిర్ణయించగా, అతని నిర్ణయం గెలుపును దూరం చేసింది. 20వ ఓవర్ బౌలింగ్ చేసిన స్టోయినిస్ ఏకంగా 23 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్ లో విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్ మూడు సిక్స్ లు, ఒక ఫోర్ సాధించడంతో 150 వరకూ ఉంటుందనుకున్న టార్గెట్ ఏకంగా 170 దాటేసింది.

ఇక మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రిషబ్ పంత్, చివరి ఓవర్ తమ కొంప ముంచిందని అంగీకరించాడు. తమ స్పిన్నర్లు అనుకున్నంతగా రాణించక పోవడంతోనే స్టోయినిస్ కు చివరి ఓవర్ ను ఇచ్చామని చెప్పాడు. ప్రతి మ్యాచ్ తమకు ఒక పాఠం నేర్పిస్తోందని, పాజిటివ్ అంశాలను స్వీకరిస్తూ, మిగతా మ్యాచ్ లను ఆడతామని తెలిపాడు. ఈ మ్యాచ్ లో ఓడిపోవడం తమకు చాలా నిరాశను కలిగించిందని వ్యాఖ్యానించిన పంత్, ఒక్క పరుగు తేడాతో మాత్రమే తాము ఓడిపోయామని, ఆర్సీబీకి తామే 15 పరుగులను అదనంగా ఇచ్చామని అభిప్రాయపడ్డాడు.

చివరి ఓవర్ లో తానైనా, హెట్ మేయర్ అయినా, ఎవరికి అవకాశం వచ్చినా, హార్డ్ హిట్టింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నామని, అయితే, టార్గెట్ కు చాలా దగ్గరగా వచ్చి, ఆఖరి మెట్టుపై ఆగిపోవడం బాధను కలిగించిందని అన్నాడు.



More Telugu News