బయో బబుల్ ను వీడి ఎటూ వెళ్లలేక... ముంబైలో చిక్కుకున్న జంపా, రిచర్డ్ సన్!

  • ఆస్ట్రేలియాకు వెళతామని చెప్పిన ఇద్దరు ఆటగాళ్లు
  • ప్రస్తుతం ఓ హోటల్ లో ఎదురుచూపులు
  • తొలుత దోహాకు, అక్కడి నుంచి ఆసీస్ చేర్చే ఏర్పాట్లు
  • బీసీసీఐ చర్యలు బాగున్నాయన్న క్రికెట్ ఆస్ట్రేలియా
ఐపీఎల్ ఆడలేమని చెబుతూ, తమ స్వదేశానికి వెళ్లిపోతామని బయటకు వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆడమ్ జంపా, రిజర్డ్ సన్ లు ఇప్పుడు కష్టాల్లో పడ్డారు. ఇంతకాలం బయో బబుల్ లో ఉన్న వీరిద్దరూ, ఇప్పుడు బయటకు వచ్చి, ఆస్ట్రేలియాకు ఎలా వెళ్లాలో తెలియక, ముంబైలోని ఓ హోటల్ లో ఉండిపోయారు. ఇండియా నుంచి వచ్చే విమానాలను ఆస్ట్రేలియా నిషేధించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తమ క్రికెటర్లు వ్యక్తిగత టూర్ లో ఉన్నందున వారికి కూడా ఎటువంటి సహాయం చేయలేమని ఆ దేశ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో తమ దేశానికి ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో వీరిద్దరూ చిక్కుకున్నారు. ఇక వీరి సమస్యను గురించి తెలుసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా, ఇద్దరినీ తొలుత దోహాకు పంపి, ఆపై ఆస్ట్రేలియాకు రప్పించేందుకు ఏర్పాట్లను ప్రారంభించింది.

ఇదే సమయంలో స్వదేశాలకు వెళ్లిపోతామన్న ఆటగాళ్లను తాము అడ్డుకోబోమని, ఇక్కడే ఉండి, ఐపీఎల్ లో కొనసాగే ఆటగాళ్లను టోర్నీ తరువాత తిరిగి స్వదేశానికి క్షేమంగా చేర్చే బాధ్యత తమదేనని బీసీసీఐ అభయం ఇవ్వడం చాలా మంది విదేశీ క్రికెటర్లకు మనోధైర్యాన్ని ఇచ్చింది. ఆడుతున్న విదేశీ ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తామని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు వారి దేశాల అధికారులతో చర్చిస్తున్నామని, ఎవరికీ ఏ అవాంతరాలు లేకుండా స్వస్థలాలకు చేరుస్తామని స్పష్టం చేసింది.

ఇండియాలో నెలకొన్న కరోనా పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, బీసీసీఐ తీసుకున్న చర్యలపై సంతృప్తికరంగా ఉన్నామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఐపీఎల్ ఫైనల్ పోటీ ముగిసేంత వరకూ తమ ఆటగాళ్ల భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటామని తెలిపింది. అవసరమైతే చార్టెడ్ ఫ్లయిట్ లను ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలిస్తామని స్పష్టం చేసింది.



More Telugu News