ఏపీలో ఒక్కరోజులో 11,434 కరోనా కేసులు, 64 మరణాలు

  • ఏపీలో కట్టలు తెంచుకున్న కరోనా
  • గడచిన 24 గంటల్లో 74,435 కరోనా పరీక్షలు
  • గుంటూరు జిల్లాలో 2 వేలకు పైగా కొత్త కేసులు
  • విజయనగరం జిల్లాలో 8 మంది మృతి
  • యాక్టివ్ కేసుల సంఖ్య 99,446
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. సెకండ్ వేవ్ లో మహోగ్రరూపం దాల్చిన కరోనా ధాటికి ఏపీ జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. నిత్యం వేలల్లో కొత్త కేసులు వస్తుండడం, పెద్ద సంఖ్యలో మృత్యువాతపడుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు.

గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 74,435 కరోనా పరీక్షలు నిర్వహించగా 11,434 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 2,028 పాజిటివ్ కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 1982, నెల్లూరు జిల్లాలో 1237, శ్రీకాకుళం జిల్లాలో 1322, విశాఖ జిల్లాలో 1067 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 7,055 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, 64 మంది మరణించారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు.

ఏపీలో ఇప్పటిదాకా 10,54,875 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9,47,629 మంది కరోనా ప్రభావం నుంచి బయటపడ్డారు. ఇంకా 99,446 మందికి కరోనా చికిత్స కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,800కి చేరింది.


More Telugu News