రాజు గారూ, మీరు మరీనూ!... ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చేయమని కోరడానికి ఇదా సమయం?: వర్ల రామయ్య

  • అక్రమాస్తుల కేసులో జగన్ పై సీబీఐ విచారణ
  • బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ పిటిషన్
  • విచారణకు స్వీకరించిన సీబీఐ న్యాయస్థానం
  • వ్యంగ్యంగా స్పందించిన వర్ల రామయ్య
  • సీఎం గొంతులో వెలక్కాయ పడిందని వ్యాఖ్యలు
అక్రమాస్తులో కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేయడం, ఆ పిటిషన్ ను సీబీఐ కోర్టు విచారణకు అర్హమైనదిగా భావించి నేడు స్వీకరించడం తెలిసిందే. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. రాజు గారూ... మీరు మరీనూ! ముఖ్యమంత్రి గారి బెయిల్ రద్దు చేయమని చెప్పడానికి ఇదా సమయం? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

"మీరు దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు విచారణకు అర్హమైనదేనని చెప్పడం, దీనితో సీఎం గారి గొంతులో వెలక్కాయ పడడం! అసలే ఆయన ఆలోచనలు అంతంతమాత్రం. ఇప్పుడు కరోనా మీద దృష్టి పెట్టాలా, లేక బెయిల్ రద్దు ఆపుకోవాలా? ఇప్పుడేంటి చేయడం?" అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు.

అయితే, ఈ ట్వీట్ లో వర్ల రామయ్య... విష్ణుకుమార్ రాజు అని పేర్కొన్నారు. దీన్ని గుర్తించిన ఓ నెటిజన్ వెంటనే స్పందించారు. "రామయ్య గారూ వీకేఆర్ కాదంటూ ఆర్ఆర్ఆర్" అంటూ సూచించారు. దీనికి వర్ల రామయ్య బదులిస్తూ "థాంక్యూ సర్, మీరు చెప్పిందే కరెక్టు" అని అంగీకరించారు.


More Telugu News