భారత్​ కు అమెరికా ‘స్ట్రైక్ టీమ్​’!

  • కరోనా ఉద్ధృతిపై సాయం
  • చేదోడుగా సీడీసీ, ఆరోగ్య నిపుణుల బృందం
  • ఆక్సిజన్ సిలిండర్లు పంపేందుకు విదేశాంగ శాఖ ఆమోదం
  • ఆక్సిజన్ ఉత్పత్తి వ్యవస్థల ఏర్పాటుపై రక్షణ శాఖ నిర్ణయం
  • భారత్ కు వెంటిలేటర్లు పంపుతామని వెల్లడి
  • రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను పంపేందుకు చర్యలు
దేశంలోని ప్రముఖుల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో భారత్ కు సాయం చేసే విషయంపై అమెరికా ముందడుగు వేసింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం ఫోన్ లో మాట్లాడారు. తాజాగా అమెరికా చేయనున్న సాయంపై మంగళవారం వైట్ హౌస్ అధికారి ప్రకటన చేశారు. భారత్ కు సాయం చేసేందుకు ‘స్ట్రైక్ టీం’ను పంపిస్తున్నట్టు చెప్పారు.

ఆ టీంలో ప్రజారోగ్య నిపుణులు ఉంటారని చెప్పారు. స్ట్రైక్ టీంను ఇండియాకు పంపించడం కోసం యూఎస్ఏఐడీ, అమెరికా సీడీసీ పనిచేస్తున్నాయన్నారు. భారత ఆరోగ్య నిపుణులు, ఆరోగ్య సిబ్బందితో కలిసి పనిచేసేందుకు ఇప్పటికే తమ ఎంబసీ అధికారులను సంప్రదించినట్టు చెప్పారు. లేబొరేటరీ సేవలు, నిఘా, ఎపిడెమియాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్, కరోనా వైరస్ జన్యు క్రమ నిర్ధారణ, వ్యాధి నమూనాలు, మహమ్మారి నివారణ, నియంత్రణ తదితరాలపై తమ నిపుణులు సాయంగా ఉంటారని చెప్పారు.

భారత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ ఉత్పత్తి కోసం తగినంత ముడిసరుకును పంపిస్తామన్నారు. ప్రస్తుతం భారత్ లో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ అధికారి చెప్పారు. ఆక్సిజన్ సరఫరాపైనా భారత్ విజ్ఞప్తి చేసిందని ఆయన గుర్తు చేశారు. భారత్ కు ఆక్సిజన్ ఉత్పత్తి వ్యవస్థలు ఇచ్చేందుకు, ఆక్సిజన్ సరఫరా చైన్ అభివృద్ధి కోసం ఇప్పటికే అమెరికా రక్షణ శాఖ, యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ లు పనిచేస్తున్నాయన్నారు.

ఆక్సిజన్ సిలిండర్ల కాంట్రాక్ట్ కు సంబంధించి ఇప్పటికే విదేశాంగ శాఖ తుది నిర్ణయం తీసేసుకుందన్నారు. ఆక్సిజన్ కానసన్ట్రేటర్లు, వెంటిలేటర్లూ ఇచ్చే విషయంపైనా చర్చలు జరుగుతున్నాయన్నారు. భారత్ తో సాంకేతిక అంశాలపై చర్చలు జరుపుతున్నామని చెప్పారు. భారత్ కోరిన అన్ని విభాగాల్లోనూ సిబ్బందికి శిక్షణనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భారత్ కు త్వరితగతిన రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను పంపిస్తామని ఆ అధికారి హామీ ఇచ్చారు. కరోనా టెస్ట్ కిట్లు, పీపీఈ కిట్లు తదితరాలనూ వెంటనే భారత్ కు పంపిస్తామని తెలిపారు.


More Telugu News