ఐపీఎల్ ను మధ్యలోనే వదిలేసి... ఆస్ట్రేలియాకు పయనమైన ముగ్గురు ఆటగాళ్లు!

  • రాయల్ చాలెంజర్స్ నుంచి జంపా, రిచర్డ్ సన్
  • రాజస్థాన్ రాయల్స్ నుంచి ఆండ్రూ టై
  • వారి నిర్ణయాన్ని గౌరవిస్తామన్న ఫ్రాంచైజీలు
ఐపీఎల్ ను కరోనా ప్రభావం తాకింది. ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు, పోటీల మధ్యలోనే వైదొలగి స్వదేశానికి పయనమయ్యారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చెందిన ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్ సన్ లతో పాటు రాజస్థాన్ రాయల్స్ కు చెందిన ఆండ్రూ టై కూడా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. వీరు ముగ్గురూ తమ వ్యక్తిగత కారణాల వల్ల పోటీల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

"ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్ సన్ వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియాకు తిరిగి వెళుతున్నారు. వారు తదుపరి ఐపీఎల్ సీజన్ కు అందుబాటులో ఉండరు. వారు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. వారికి పూర్తి మద్దతు తెలుపుతున్నాం" అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేసింది. ఇదే సమయంలో "ఆండ్రూ టై ఈ ఉదయం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. వ్యక్తిగత కారణాలతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. అతనికి కావాల్సిన సపోర్ట్ ను మేము అందిస్తాం" అని రాజస్థాన్ రాయల్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పేర్కొంది.

కాగా, తాను తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లడంపై ఆండ్రూ టై స్పందిస్తూ, తాను ఎక్కడ ఆస్ట్రేలియాకు వెళ్లకుండా ఇక్కడే చిక్కుకుపోతానేమోనన్న ఆందోళనలో ఉన్నానని, తన స్వరాష్ట్రమైన వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని చెప్పాడు. పెర్త్ లో చాలా కేసులు ఉన్నాయని ఆయన చెప్పాడు. చాలా కాలం నుంచి బయో బబుల్ ఉండటం కూడా తాను తప్పుకోవడానికి కారణమని చెప్పాడు. ఇదిలావుండగా, ఐపీఎల్ లో ఆడుతున్న మిగతా ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా స్వదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.



More Telugu News