ఓ వైద్యుడి కుటుంబంలో కరోనా కల్లోలం!

  • పుణేలో విషాదం
  • కరోనాతో డాక్టర్ రాయ్, ఆయన సోదరి మృతి
  • ఒకే ఇంట్లో ముగ్గురు తోబుట్టువులు
  • మానసిక వైకల్యంతో బాధపడుతున్న గీతిక, సంజయ్
  • వారిద్దరికీ పెద్దదిక్కుగా డాక్టర్
  • తోబుట్టువులను కోల్పోయి ఒంటరివాడైన సంజయ్
కరోనా రక్కసి అనేక ప్రాణాలను హరించివేస్తూ, కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. పుణేకు చెందిన ఓ వైద్యుడి కుటుంబంలోనూ కరోనా తీవ్ర విషాదాన్ని నింపింది. పుణేకు చెందిన సుబీర్ సుధీర్ రాయ్ ఓ కంటి వైద్యుడు. ఆయన వయసు 68 సంవత్సరాలు. నగరంలోని ప్రభాత్ రోడ్ లో ఓ ఫ్లాట్ లో తన సోదరి గీతిక (65), సోదరుడు సంజయ్(60)తో కలిసి నివసిస్తుంటారు. వీరు ముగ్గురూ అవివాహితులు. మానసిక వైకల్యంతో బాధపడుతున్న తోబుట్టువులకు ఆయనే చికిత్స చేయిస్తున్నారు. డాక్టర్ సుధీర్ రాయ్ అనేక ప్రాంతాల్లో క్లినిక్స్ నిర్వహిస్తున్నారు.

అయితే, శనివారం ఉదయం ఆయన తన నివాసంలో విగతజీవుడిగా పడివుండడాన్ని గుర్తించారు. ఆయన సోదరి గీతిక అపస్మారక స్థితిలో ఉండడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అదే రోజు మధ్యాహ్నం ఆమె ప్రాణాలు విడిచింది. వీరిద్దరి నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా, కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. డాక్టర్ రాయ్ సోదరుడు సంజయ్ కరోనా పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది.

కాగా, పుణేలోనే ఉంటున్న డాక్టర్ రాయ్ బంధువులు ఫోన్ చేయగా, ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో వారు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో ఆయన మృతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పాక్షికంగా కుళ్లిన స్థితిలో ఉన్న డాక్టర్ రాయ్ మృతదేహాన్ని బాత్రూంలో గుర్తించారు. అప్పటికే డాక్టర్ రాయ్ మరణించి మూడ్నాలుగు రోజులు అయ్యుంటుందని భావిస్తున్నారు. కాగా, తోబుట్టువులను కోల్పోయిన సంజయ్ ఇప్పుడు ఒంటరిగా మిగిలాడు. ఆయన మానసిక పరిస్థితి దృష్ట్యా బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News